ప్రతి రైతును ఆదుకుంటాం

-నష్టం అంచనా వేయడానికి గ్రామానికో ప్రత్యేకాధికారి
-క్రాప్ ఇన్సూరెన్స్‌తో న్యాయం చేస్తాం: మంత్రి హరీశ్‌రావు
-మెదక్ జిల్లాలో వడగండ్ల బాధితులకు ఓదార్పు

Harish Rao inspect Rain hit areas in  Medak district

మాది రైతు ప్రభుత్వం. వడగండ్ల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. పంటలు నష్టపోయిన రైతాంగానికి రెండు నెలల్లోపే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాంఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ, సిద్దన్నపేటల్లో బుధవారం వడగండ్ల వర్షానికి సుమారుగా 500 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గురువారం ఉదయం మంత్రి హరీశ్‌రావు ఆయా గ్రామాలకు వెళ్లి పొలాలను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వడగండ్లతో నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
పంట నష్టం అంచనా వేయడానికి ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి ఫీల్డ్ వర్క్ చేసి జాబితాను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 48 గంటల్లో తుది జాబితాను తయారు చేసి అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద నష్టపోయిన రైతుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచుతారన్నారు. నష్టపోయిన ఏ ఒక్కరైతు పేరు లేకపోయినా అధికారులకు తెలియజేస్తే నమోదు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. మొక్కజొన్న, వరి, మామిడి తోటలకు రైతులు కట్టుకున్న ఇన్సూరెన్స్ విషయమై నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఇన్సూరెన్స్ కంపెనీ కమిషనర్ రాజేశ్వరితో ఫోన్‌లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు.

సిబ్బంది కొరత వల్ల వేగంగా పనులు చేయలేకపోతున్నామనడంతో, వెంటనే వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శినితో మాట్లాడారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అవసరమైన సిబ్బంది వ్యవసాయశాఖ నుంచి డిప్యూటేషన్‌పై పంపించి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కోసం ఎరువులను అందుబాటులో ఉంచేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మంత్రి వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి హుక్యానాయక్, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, సిద్దిపేట ఏడీఏ వెంకటేశ్వర్‌రావు, ఉద్యానవనశాఖ అధికారి భాస్కర్‌రెడ్డిఉన్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా చద్మల్‌తండాలో కూలిన ఇండ్లను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గురువారం పరిశీలించారు.