ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీరు

వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీళ్లందుతాయని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్ పైలాన్‌కు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రక్షిత మంచినీరు మానవహక్కుగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టారన్నారు. అత్యంత ఫ్లోరిన్ పీడిత ప్రాంతంగా గుర్తించబడిన మునుగోడు నుంచే వాటర్‌గ్రిడ్ పనులు ప్రారంభించడం హర్షణీయమన్నారు.

KTR

-సమైక్య పాలనలో అభివృద్ధికి దూరంగా తెలంగాణ
-కొత్త రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ: ఐటీ మంత్రి కేటీఆర్
-రూ.45 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్: మంత్రి జగదీశ్‌రెడ్డి
చౌటుప్పల్‌లో పైలాన్ ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్నారు. కృష్ణా నది జిల్లా నుంచే పరుగులు పెడుతున్నా ఈ ప్రాంత ప్రజలు ఇన్నాళ్లుగా కనీసం తాగునీటి సౌకర్యానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నల్లగొండ జిల్లాలోనే 2 లక్షల మంది ఫ్లోరిన్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలిపారు. ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తులను చూసి చలించిన సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టారన్నారు.

గత ప్రభుత్వాలు తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా చిన్నచూపు చూశాయని, రాష్ట్రం సిద్ధించిన ఆరునెల్లల్లోనే కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు కేటాయించి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించారని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, జీవన ప్రమాణాల పెరుగుదల, 24 గంటల విద్యుత్‌కు ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు.

అరవై ఏండ్లుగా జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఐదేండ్లలో జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్లోరిన్ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ రూ.45 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌కు సన్నాహాలు చేస్తున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గంపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని, అందుకే ఈ ప్రాంతం నుంచే వాటర్‌గ్రిడ్ పనులు ప్రారంభిస్తున్నారన్నారు.