ప్రతి గింజను మద్దతు ధరలతో ప్రభుత్వం కొంటది

-పత్తి మద్దతు ధర రూ.5 వేలకు పెంచాలని కోరాం
-దళారులను నమ్మి మోసపోవద్దు: ఆర్థిక మంత్రి ఈటల
అనేక సంక్షేమ పథకాలకు కేంద్రం క్రమంగా కత్తెర వేస్తున్నది. మోడల్, కస్తూర్బాగాంధీ స్కూళ్లను అట్టహాసంగా ప్రారంభించి వదిలేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సి వస్తున్నది అని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.

Etela Rajendar in Huzurabad constituency

గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంపులో ఐసీడీఎస్ భవనానికి శంకుస్థాపన చేశారు. తర్వాత జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్, మార్క్‌ఫెడ్, సీసీఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కేంద్రం గతంలో రూ.17,800 కోట్ల్లు ఇవ్వగా, ప్రస్తుతం రూ.800 కోట్లు మాత్రమే ఇస్తున్నదని, అయినా రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరగకుండా 16 నుంచి 30గుడ్లను అందిస్తున్నామని అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు రూ.7వేలు, రూ.5వేల చొప్పున వేతనాలు పెంచామన్నారు. క్వింటాల్ పత్తి ధర రూ.5 వేలకు పెంచాలని కేంద్ర జౌళిశాఖ మంత్రికి లేఖ రాశామని, తేమ శాతాన్ని కూడా 20 శాతానికి పెంచాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుత సమయంలో నీళ్లు చల్లకున్నా పత్తిలో తేమ అధికంగానే ఉంటుందని సీసీఐ అధికారులు గుర్తించాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పత్తికి మద్దతు ధర విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. వరి మద్దతు ధర ఏ గ్రేడ్‌కు రూ. 1450, బీ గ్రేడ్‌కు రూ.1410, మొక్కజొన్నలకు రూ.1325 చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తులు మార్కెట్‌కు ఎక్కువగా వస్తే ఐకేసీ కేంద్రాలతోపాటు అవసరమైతే మిల్లుల్లో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.