ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్-2

-ఐదేండ్లలో లక్షా 25 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు లక్ష్యం
-టీహబ్-1లో 337 స్టార్టప్‌ల ఇంక్యుబేట్.. త్వరలో టీఫండ్ విధివిధానాలు
-నల్లగొండ, మిర్యాలగూడలో ఐటీ పరిశ్రమలు స్థాపిస్తే సహకారం
-మహబూబ్‌నగర్‌లో ఐటీపార్క్ ఏర్పాటుచేస్తాం
-అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న టీహబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ కాబోతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. టీహబ్-1 విజయవంతమయ్యిందని, అదే ఉత్సాహంతో టీహబ్-2కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సాంకేతిక, విజ్ఞాన అంశాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై ఎమ్మెల్యేలు బిగాల గణేశ్, పువ్వాడ అజయ్‌కుమార్, కేపీ వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తాము బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం నుంచి ఏటా రూ.57వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు ఉండగా, రాబోయే ఐదేండ్లలో ఎగుమతులు ఏటా రూ.లక్షా 25వేల కోట్లకు చేరుకోవాలని ఆనాడే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆ లక్ష్యాన్ని చేరుతామని ధీమా వ్యక్తంచేశారు. 2015-16లో ఐటీ ఎగుమతుల విలువ రూ.75,070 కోట్లు ఉండగా, 2016-17లో 13.85% వృద్ధిరేటుతో రూ. 85,470 కోట్లకు పెరిగాయి. భారతదేశంలోనే తొలిసారిగా నిర్వహించబోతున్న వరల్డ్ కాంగ్రెస్ ఐటీకి హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమని కేటీఆర్ అన్నారు.

ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 3,000 మంది ఐటీ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీ ఫండ్ పేరుతో నిధిని ఏర్పాటుచేస్తున్నామని, విధివిధానాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. గోవా, అసోం, త్రిపుర రాష్ర్టాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించబోతున్నామని, ఆయా రాష్ర్టాలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికే ప్రారంభించిన టీహబ్‌లో 337 స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేశామని, ఇవి పెట్టుబడిదారుల నుంచి రూ.91.65 కోట్ల నిధులు సమకూర్చాయని తెలిపారు. 25 కార్పొరేట్ సంస్థల నుంచి టీహబ్ భాగస్వామ్య ప్రతిపాదనలు స్వీకరించినట్టు, దాదాపు 10 స్టార్టప్‌లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్టు వివరించారు.

టీబ్రిడ్జ్ అనే విలక్షణమైన కార్యక్రమాన్ని కూడా టీహబ్ ప్రారంభించినట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. దీనిద్వారా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేలా వాటిని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఐటీ పరిశ్రమ ప్రారంభ దశలో ఉన్నదని, అక్కడ ఐటీ పరిశ్రమలు ప్రారంభమైతే స్థలాలు కేటాయించేందుకు అభ్యంతరంలేదని ఎమ్మెల్యే బిగాల గణేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఐటీ పరిశ్రమల్లో పనిచేసే మహిళల భద్రతపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారని, ఇప్పటికే షీ టీమ్స్, షీ షటిల్స్, మహిళా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నామని పేర్కొన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వ సహకారం అందిస్తామని, మహబూబ్‌నగర్‌లోనూ ఐటీపార్క్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఖమ్మంలో ఫేజ్-2 ఏర్పాటుకు వెంటనే అనుమతులిస్తామని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.