ప్రాణహిత పనుల్లో వేగం పెరగాలి

-టన్నెల్ పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్
ప్రాణహిత-చేవేళ్ల 9వ ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని మధ్యమానేరు నుంచి గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరును, ఎత్తిపోతల ద్వారా నింపేందుకు సిరిసిల్ల శివారులో చేపట్టిన కాల్వల నిర్మాణాలను, మల్కపేట వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్ పనులను సోమవారం మంత్రి పరిశీలించారు.

KTR visit to siricilla constituency

సిరిసిల్ల బైపాస్ రోడ్డు శివారులో జరుగుతున్న కాల్వ నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 2012లో శంకుస్థాపన చేసిన ఈ పనులు ఇంత నత్తనడకన కొనసాగుతుండడంతో ఇంకా ఎంతకాలం పనిచేస్తారని అధికారులను ప్రశ్నించారు. భూసేకరణలో జాప్యం జరిగిందని చీఫ్ ఇంజినీర్, ఆర్డీవోలు చెప్పారు. రెవెన్యూ ఫారెస్టు, పట్టాభూములు కలిపి నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పడంతో వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త జీవో ప్రకారం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎత్తిపోతల పథకం పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోనని స్పష్టంచేశారు.

ఇఫ్తార్ విందును రాజకీయం చేయద్దు : పేద ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం మనస్ఫూర్తిగా అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. సిరిసిల్లలోని గాజుల మల్లయ్య కల్యాణ మండపంలో సోమవారం రాత్రి ముస్లిం సోదరులకు నిర్వహించిన ఇప్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. అన్ని పండుగలు ఎలా చేస్తున్నామో అలాగే రంజాన్ పండుగ కూడా మనదే అన్న ఉద్దేశంతో నిర్వహిస్తుంటే దీన్ని కూడా కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.