ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా

రాష్ర్టానికి కీలకమైన ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులతోపాటు ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు సూచించారు. ఒకరోజు పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీ వచ్చిన రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర సాగునీటి అవసరాల గురించి వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతోపాటు ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇప్పించడానికి చొరవ తీసుకోవాలని ఉమాభారతిని కోరారు.

– కేంద్ర మంత్రి ఉమాభారతి హామీ
-వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
-కృతజ్ఞతలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు

Harish Rao met Union Minister Umabharathi

కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే జలవనరుల విభాగం సంపూర్ణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని, అభివృద్ధిలో కేంద్రంతో సమానంగా ఎదగాలని భావిస్తున్నదని, అందుకు కేంద్రం సహకారం కూడా కావాలని కోరారు. రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఎనిమిది జిల్లాలు కరువు కోరల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే గుర్తించిందని, ఈ జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఒక్కటే జీవనాధారమని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ పేర్కొన్నట్లుగా సుమారు 160 టీఎంసీల నీటిని తెలంగాణ అభివృద్ధికి వినియోగించుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్యాకేజీలో కూడా చేర్చారని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉమాభారతి, జలవనరులశాఖ సలహాదారు సమక్షంలోనే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాకు హామీ ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.