ప్రజాఉద్యమంగా మిషన్ కాకతీయ

-పారదర్శకంగా పునరుద్ధరణ కార్యక్రమాలు
-ప్రజలంతా భాగస్వాములవ్వాలి
-రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు

Harish-Rao-in-Mission-Kakatiya-Awareness-programme

మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా మార్చుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పబ్లిక్‌గార్డెన్స్ ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల సంఘం, విశ్రాంత వ్యవసాయ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వారసత్వంగా వస్తున్న తెలంగాణ చెరువుల వ్యవస్థను ఉమ్మడిరాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు కుప్పగూల్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితినుంచి చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం కంకణం కట్టిందని చెప్పారు. రైతులకు నీరిందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని మొత్తం 40 వేలకు పైగా చెరువుల మరమ్మతు కార్యక్రమం తీసుకున్నామన్నారు.

ఈ సంవత్సరం 9 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ దిశగా ఇప్పటికే 5వేల చెరువుల పునరుద్ధరణ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చామని వివరించారు. త్వరలో ఉపాధి హామీ పథకంతో ఒప్పందం చేసుకుంటామన్నారు. చెరువుల అభివృద్ధిలో భాగంగా నీటిపారుదల శాఖను క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, ఇదివరకు నాలుగు జిల్లాలకు ఓ ఎస్‌ఇ ఉంటే ఇపుడు జిల్లాకో ఎస్‌ఈని నియమించామని చెప్పారు. చెరువుల పునరుద్ధరణలో అవినీతి జరుగుతుందని ఓ విపక్ష నేత ఆరోపణలు ఆయన కొట్టిపారేశారు. మిషన్ కాకతీయ పూర్తిస్థాయి పారదర్శకతతో అవినీతికి ఆస్కారమివ్వకుండా పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ దిశగా వ్యవసాయ అధికారులు, మాజీ అధికారులు తమ సూచనలు, సలహాలు, అనుభవాలను అందించాలని విజప్తి చేశారు. ఇదే సమయంలో భారీనీటిపారుదల రంగం మీద కూడా ప్రభుత్వం విశేష కృషి జరుపుతున్నదని,ఇతర రాష్ర్టాలతో సమస్యలు పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పనులను ఇటీవలే చేపట్టామని చెప్పారు.ఈ కార్యక్రమానికి రాలేకపోయిన వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సెల్‌ఫోన్ ద్వారా సభికులకు సందేశాన్ని ఇచ్చారు. తన మొత్తం రాజకీయ జీవితంలో మిషన్ కాకతీయ వంటి గొప్ప కార్యక్రమాన్ని ఇంతవరకూ చూడలేదన్నారు. కేసీఆర్ ముందుచూపుతో రైతుల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును తీసుకున్నారని, దీన్ని సమర్థంగా అమలు పరచడం కోసం హరీష్‌రావుకి అప్పగించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మాజీ అధికారుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, నాయకులు హసన్, మురళీధర్, యాదగిరి తదితరులతోపాటు పది జిల్లాల నుంచి అధికారులు పాల్గొన్నారు. మాజీ అధికారి జయరాజ్ చెరువుల వల్ల ఉపయోగాలపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు.