ప్రజాసమస్యలు పరిష్కరిస్తాం

-కల్లడి ప్రజాదర్బార్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-గ్రామంలో కలియతిరిగిన మంత్రి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

Pocharam Srinivas Reddy

ప్రజాసమస్యలు పరిష్కరించి, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లడి గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి మంత్రి పోచారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, ప్రజలతో ప్రజాదర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వివిధ కుల సంఘాలు అడిగిందే తడువుగా కల్లడిపై వరాల జల్లులు కురిపించారు. గ్రామంలో 393 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.40 లక్షలు మంత్రి మంజూరు చేశారు. ముఖ్యంగా దళితుల సమస్యలను వారు అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామంలో మొదటి విడతలో చేపట్టిన మిషన్ కాకతీయ పనులను మంత్రి, ఎమ్మెల్యేతో కలిసి పరిశీలిచారు. పనులు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇరిగేషన్ ఏఈ గంగారాంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆ చెరువుతోపాటు మిగతా రెండు చెరువుల పునరుద్ధరణకు మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు రైతులతో, వీడీసీ సభ్యులతో మాట్లాడి సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.