ప్రజల్లో విశ్వాసమే మా బలం!

హైదరాబాద్‌ను ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే అభివృద్ధి పరుచగలుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆ విశ్వాసమే తమ పార్టీకి తిరుగులేని విజయం సాధించిపెడుతుందని ఆయన అన్నారు.

-నగరంలో లక్ష ఇండ్లు కట్టబోతున్నాం
-మురికివాడలు లేని నగరంగా మార్చుతాం
-కేసీఆర్ పాలనాదక్షతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
-వంద సీట్లు గెలిచి మేయర్ పీఠం సాధిస్తాం
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddy

20 నెలల కేసీఆర్ పాలనా దక్షత ప్రజలను ఆకట్టుకుందని, ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిమాటను నిలుపుకుంటుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలనే దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించాలని ఇప్పటికే నిర్ణయం చేసుకున్నారని అన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి మేయర్ పీఠం గెలుచుంటామని ఛాలెంజ్‌గా చెప్తున్నామని అల్లోల అన్నారు. సనత్‌నగర్ టీఆర్‌ఎస్ పరిశీలకులుగా వ్యవహరిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూనిచ్చారు. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురడం ఖాయమంటున్న మంత్రి ఇంద్రకరణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రజల్లోకి వెళితే ఎలా ఉంది? ప్రజల స్పందన ఏమిటి?
అద్భుతంగా ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది. ఇపుడు బంగారు తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో హైదరాబాద్ పాత్ర ముఖ్యమైంది. ఈ నగరం ఎంత అభివృద్ధి జరిగితే అంత మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రజలకు ఈ విషయం అర్థమైంది. సీఎం కేసీఆర్ నిర్ణయాలు, అమలు చేసే పద్ధతిని ప్రజలు చూశారు. ఇవాళ ఒక్క టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే ఇచ్చిన మాట నిలుపుకుంటుందనే నమ్మకం వారికి కలిగింది. అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రజల్లో విశ్వాసం కనిపిస్తున్నది. అదే మా బలం.

మ్యానిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది?
ప్రజలే కేంద్రంగా మా మ్యానిఫెస్టో ఉంటుంది. ఎన్నికల్లో ఏ మాట ఐతే ఇస్తున్నమో దాన్ని తూ.చ తప్పకుండా అమలు చేస్తాం. ఒకట్రెండు రోజుల్లో మ్యానిఫోస్టో విడుదల చేయటమే కాదు.. ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా తీసుకువెళ్తాం. మ్యానిఫెస్టో చదివాకే ఓటు వేయండి అని కోరుతాం.

డబుల్ బెడ్ ఇండ్ల విషయానికి వద్దాం…నియోజకవర్గానికి 400 ఇండ్లు సరిపోవని ప్రతిపక్షాల విమర్శ..
మేం గత పాలకుల్లాగా మాటలతో సరిపెట్టం. చెప్పింది అక్షరాలా చేస్తాం. ఇపుడు నియోజకవర్గానికి 400ల చొప్పున ఇచ్చినం. మార్చిలో అదనంగా వెయ్యేసి ఇండ్లు ఇవ్వబోతున్నాం. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష ఇండ్లు కట్టాలని సీఎం నిర్ణయించారు. అత్యవసరంగా 10వేల ఇండ్లు కడుతున్నం. స్లమ్స్‌లలో జీ+9 అంతస్తుల్లో నిర్మాణానికి కూడా ప్రజలు అంగీకరిస్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో వెంటనే టెండర్లు సైతం పిలిచి పనుల ప్రారంభిస్తున్నాం.

ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నారన్న విమర్శలపై మీరేమంటారు?
మా బలం ప్రజల్లో ఉంది. కాబట్టే టీడీపీ, కాంగ్రెస్‌నుంచి మా పార్టీలోకి వస్తున్నరు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లాగ మాకు ధన బలం లేదు. ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం లేదు.. ప్రజాబలం చూసే స్వచ్ఛందంగా వస్తున్నారు.

18 నెలల కాలంలో మీరేం చేయలేదనే విమర్శలను ఎలా చూస్తారు?
వరంగల్ ఫలితం ఒక్కటి చాలు. మేం ఏం చేశామో ఏం చేయలేదో చెప్పడానికి. 60 ఏండ్లు అధికారంలో ఉన్న వాళ్లు సమస్యల మీద నిద్ర పోయారు. అందుకే మాకు ప్రజలు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 18 మాసాల్లోనే అనేక కార్యక్రమాలు చేశాం. కరెంటు సమస్య లేకుండా చేశాం. తాగునీటి సమస్య పరిష్కరించాం. పింఛన్లు పెంచి పేదలకు అండగా నిలిచాం. ఇండ్ల నిర్మాణం ప్రారంభించాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 33వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. విమర్శలు చేసిన వారికి ఇప్పటికే వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పారు.

హైదరాబాద్ నగరంలోని భిన్నత్వం మీద మీ విధానం…
హైదరాబాద్ ఎప్పటినుంచో మెట్రోపాలిటన్ సిటీ. ఎన్నో దశాబ్దాలనుంచి గంగా-జమునా తహజీబ్‌తో ముందుకు వెళ్తున్నది. మా పార్టీ మొదటినుంచీ ఈ విషయం చెప్తున్నది. ఇక్కడ నివసించే వారంతా తెలంగాణ బిడ్దలేనని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. అందరినీ అన్ని రకాలుగా గౌరవించి కాపాడుకుంటాం. ఏడాదిన్నర కాలంలో ఎవరికీ ఏ చిన్న ఇబ్బందీ రాలేదు. ఇకపై కూడా ఇదే విధానం కొనసాగుతుంది.