ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం

-పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పడండి
-రాష్ట్రాభివృద్ధికి సర్పంచ్ నుంచి సీఎం దాకా కష్టపడాలి
-స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపు

KCR 005

ప్రజాప్రతినిధులు పైరవీలు, అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సదాశయంతో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థ గత ప్రభుత్వాల హయాంలో నిర్వీర్యమైందని, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికల్లో గెలుపొందిన కరీంనగర్, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్లు తుల ఉమ, గద్దల పద్మ సీఎం కేసీఆర్‌ను ఆదివారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నో ఆశలతో ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేయొద్దని సీఎం కోరారు. అభివృద్ధిపై రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వీటిపై ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఆ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు.

ప్రభుత్వానికి చెడ్డపేరు తేకుండా అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని కోరారు. టీఆర్‌ఎస్ తరఫున కొత్తగా ఎన్నికయిన ప్రజాప్రతినిధులను మంచి ప్రజాసేవలకులగా తయారుచేస్తామని చెప్పారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ సార్థకం కావాలంటే సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరూ కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. వరంగల్ జెడ్పీ పీఠం దక్కించుకోవటంలో విశేష కృషి చేసిన టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావును కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. డిఫ్యూటీ సీఎం రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు సీతారాంనాయక్, బీబీ పాటిల్, వినోద్, కడియం శ్రీహరి, సుమన్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కొండాసురేఖ, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్, కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు కూడా కేసీఆర్‌ను కలిశారు. భేటీ అనంతరం రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో గర్వపడే స్థితిలో ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారని తెలిపారు. ఆ దిశలోనే తామంతా నడుస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనన్నారు. కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ తెలంగాణను అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.