ప్రజా ఉద్యమ ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం: కేసీఆర్

తెలంగాణ ప్రజల కల సాకారమైన ఈ శుభ తరుణంలో సమస్త తెలంగాణ ప్రజానీకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లో… ఈవిజయం ప్రజలది. అనేక గెలుపులు, ఓటమిల తర్వాత తెలంగాణ వచ్చింది. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎన్నటికీ మరువలేనిది. తెలంగాణ ఆవిర్భావ ఘట్టంలో అన్ని వర్గాలు భాగస్వాములే. తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయాలని తలపెట్టింది. అవినీతిని పారదోలడమే లక్ష్యంగా పని చేస్తాం. రాజకీయ అవినీతి అంతానికి ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాజకీయ అవినీతిని పెకిలించినప్పుడే అభివృద్ధి జరగుతుంది. ప్రభుత్వ పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మురికి వాడల్లేని నగరంగా అభివృద్ధి చేస్తాం. మహిళలపై ఆగడాలను మా ప్రభుత్వం ఎంత మాత్రం సహకరించదు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం.

kcr2తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్
తెలంగాణ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ పే స్కేలు ఇస్తాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వీలైనంత త్వరగా హెల్త్ కార్డులు ఇస్తాం. పీఆర్సీ అమలు చేస్తాం. ఉద్యోగుల సకల జనుల సమ్మె మరువలేనిది.

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. వృద్ధులకు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 ఫించన్ తప్పకుండా ఇస్తాం. బలహీన వర్గాలకు గృహలను కట్టిస్తాం. 125 గజాల స్థలంలో ఒక హాలు, రెండు బెడ్‌రూమ్‌లు, కిచెన్ కట్టిస్తాం. రైతులకు లక్ష రూపాయాల వరకు రుణమాఫీతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తు.చ తప్పకుండా అమలు చేస్తాం.

సంక్షేమానికి పెద్ద పీట
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం. దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. రాబోయే ఐదు సంవత్సరాల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు, గిరిజనుల సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తాం. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణను పునీతం చేస్తాం. రియల్ ఎస్టేట్ రంగాన్ని సంస్కరిస్తాం. విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.

పోలీసులందరికీ రాష్ట్ర అవతరణ పతకాలు
పోలీసులందరికీ రాష్ట్ర అవతరణ పతకాలు ఇస్తాం. పోలీసుల సమస్యలు నాకు తెలుసు. పోలీసుల సమస్యలపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాను. హోంగార్డులకు మెడికల్ అలవెన్స్ ఇస్తాం. పోలీసుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా.

వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్ద పీఠ వేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయ పరిశోధనలు అనుకున్నంత స్థాయిలో జరగట్లేదని, వ్యవసాయ రంగాన్ని అభివద్ధి చేయడానికి పరిశోధనలు ఎంతో అవసరమని, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం మందుకెళ్తుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులకు రూ. లక్ష లోపు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తుందని స్ఫష్టం చేశారు. విత్తన ఉత్పత్తికి ప్రపంచంలోనే రెండు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారని, అందులో తెలంగాణ ప్రాంతం ఒకటని కేసీఆర్ అన్నారు. విత్తన ఉత్పత్తిలో తెలంగాణను దేశానికే తలమానికంగా చేస్తామని, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకోస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

గ్రీన్‌హౌస్ సాగును ప్రోత్సాహిస్తాం. వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపడతామని చెప్పారు. ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తాం. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక విధానం ప్రకటిస్తాం. రియల్‌ఎస్టేట్‌ను గాడిలో పెట్టి ఉపాధి అవకాశాలు పెంపొదిస్తాం. పారిశ్రామిక వర్గాల నుంచి సలహాలు తీసుకుంటాం. తెలంగాణలో పౌల్ట్రీ, ఫార్మా రంగాలకు భారీ ప్రోత్సాహం.

మూడేళ్లలో సరప్లస్ పవర్ స్టేట్‌గా మారుస్తాం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలు ప్రధానంగా విద్యుత్‌పై ఆధారపడి నడుస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. రానున్న మూడేళ్లలో తెలంగాణ రాష్ర్టానికి విద్యుత్ లోటు లేకుండా చేస్తామని, సరప్లస్ పవర్ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని కేసీఆర్ చెప్పారు. విద్యుత్‌ను కొనుగోలు చేసే స్థాయినుంచి ఇతర రాష్ర్టాలకు విద్యుత్‌ను అమ్మే స్థాయికి రాష్ర్టాన్ని తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వమే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రైవేటు రంగంలో కరెంటు ఉత్పత్తి తెలంగాణలో ఉండదని స్ఫష్టం చేశారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతాం
బాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు ఐటీఆర్ ప్రాజెక్టు వచ్చిందని, దాని అమలు చేయడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలు ఒకే ప్రాంతంలో గాకుండా నగరం నలుమూలకు విస్తరించేలా ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను మురికివాడల్లేని నగరంగా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రపంచ నలుమూలలనుంచి హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని, సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.