ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలి: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి మొదటినుంచి అండగా నిలిచిన ఈ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తామని, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరిస్తామని చెప్పారు. లెండి ప్రాజెక్టు ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు లక్ష్యంతో జిల్లాలో ఏడు చెరువులను రిజర్వాయర్లుగా మారుస్తున్నామని, ప్రాణహిత- చేవెళ్ల కింద చేపట్టిన కాల్వలను వినియోగంలోకి తెస్తామని చెప్పారు.

CM-KCR-review-on-Nizamabad-dist-development

-కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాకు గరిష్ఠ ప్రయోజనం
-మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీరు
-కాళేశ్వరంతో ప్రాణహిత- చేవెళ్ల కాలువలకు లింక్ నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణ
-జాతీయ రహదారికిరువైపులా డబుల్‌ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలు.. సీఎం కోటా కింద అదనంగా 2 వేల ఇండ్లు
-కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాలకు భూసేకరణ జరపండి
-నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష

డబుల్ బెడ్‌రూం పథకం కింద జిల్లాకు అదనంగా రెండువేల ఇండ్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఈ కాలనీలను జాతీయ రహదారులకు ఇరువైపులా చేపట్టి అన్ని రాష్ర్టాల వారికీ ఈ పథకం విశిష్టతను చాటి చెప్పాలని సీఎం ఆదేశించారు. కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాల సేకరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీరు, మిషన్ కాకతీయ, ఇండ్ల పథకం, కరువు నివారణ తదితర అంశాలమీద చర్చించారు.

నిజాంసాగర్, ఎస్సారెస్పీ కాలువలకు గోదావరితో లింక్: గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్ర వాటా 950 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు మూడు లక్షల ఎకరాలకు, ఎస్సారెస్పీకి వరద ప్రవాహం ఆగిపోయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు గ్యారెంటీగా నీటిని ఇచ్చే విధంగా ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా అడుగంటిపోయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ ప్రాజెక్టును లింక్ చేసి గోదావరి నీళ్లతో నింపుతామన్నారు. నిజాంసాగర్ నుంచి ఎస్సారెస్పీ కాలువలకు లింక్ చేసి జిల్లాలో ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. ఈ మేరకు కాలువలన్నింటికి మరమ్మత్తులు చేస్తామన్నారు. ఈ వివరాలను ఆయన గూగుల్ మ్యాప్‌లో ఎమ్మెల్యేలకు వివరించారు. ప్రాజెక్టుల రీడిజైన్ ద్వారా వచ్చే కొత్త ప్రాజెక్టులతో జిల్లాలో ఎక్కువ వ్యవసాయ భూమి సాగయ్యేలా రిజర్వాయర్లు, కాలువలు నిర్మిస్తామన్నారు. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో 2, 3 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగే చెరువులను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. కాగా లైడార్ సర్వే ద్వారా ఇప్పటికే ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలలో దాదాపు ఏడు చెరువులను రిజర్వాయర్లుగా మార్చే అంశాన్ని గుర్తించామన్నారు. ఇవి కాకుండా రిజర్వాయర్లుగా మార్చేందుకు మరిన్ని చెరువులను గుర్తించాలని తెలిపారు. ఒకేచోట రెండు చెరువులు దగ్గరగా ఉంటే వాటిని కలిపి ఒకటే రిజర్వాయరు చేస్తే పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసుకోవచ్చునన్నారు. గోదావరి జలాలను హల్దీ నదిలోకి పోసే అంశాన్ని ఎమ్మెల్యేలకు ఆయన గణాంకాలతో వివరించారు. దీనిద్వారా 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నిజాంసాగర్, ఎస్సారెస్పీ కాల్వలకు పూర్తిస్థాయిలో వేగంగా మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరంతో జిల్లాకు గరిష్ఠప్రయోజనం…
కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్ జిల్లాకు గరిష్ఠంగా మేలు జరుగుతుందని సీఎం అన్నారు. ముఖ్యంగా మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్‌కు గోదావరి నీటిని తరలించి అక్కడి నుంచి ఎస్సారెస్పీ కాలువలకు లింక్ చేయడం జరుగుతుందని వివరించారు. దీనికి అనుగుణంగా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం జరగాలని ఆదేశించారు. గతంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలనన్నింటినీ పూర్తిగా వినియోగించుకొంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ కాలువలను లింక్ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ ప్రాజెక్టులో భాగంగా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు నీరందించేందుకు ప్రగతిలో ఉన్న పనులను యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని సీఎం వివరించారు. ఈప్రాజెక్టు పనులు వేగంగా జరగాలని, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

వేగంగా మిషన్ కాకతీయ..
మిషన్ కాకతీయ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఏడాది వర్షపాతం సరిగా లేక చాలా చెరువుల్లోకి నీరు రాలేదని, అలాంటి చెరువులన్నింటిని గుర్తించి వాటిలో ముందుగా పనులు చేపట్టాలన్నారు. కరువు పరిస్థితులను సానుకూలంగా తీసుకోవాలని తెలిపారు. మొదటి దశ మిషన్ కాకతీయలో పూడిక తీసిన చెరువులు ఎన్ని? సగం పూడికతో ఆగిపోయిన చెరువులు ఎన్ని? సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఈసారి మిషన్ కాకతీయలో మరిన్ని ఎక్కువ చెరువులను చేపట్టాలన్నారు. జిల్లా అంతటా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులకు సూచనలిచ్చారు. తాగునీటి ఎద్దడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.

కాలనీలుగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు..
డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను కాలనీలుగా నిర్మించాలని ఆదేశించారు. ఒక్కో కాలనీలో కనీసం 50 ఇండ్లు ఉండాలని, ఈ మేరకు కాలనీల లేఅవుట్ రూపొందించాలని ఆదేశించారు. దాదాపు జిల్లా మొత్తం జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నందున ఈ కాలనీలను కూడా జాతీయ రహదారులకు ఇరువైపులా వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు ఈ రహదారి వెంట వెళ్లే ఇతర రాష్ర్టాల వారిని ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం విశిష్టత దేశమంతా తెలిసేవిధంగా కాలనీలు రూపొందాలని అన్నారు. జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గానికి 400 చొప్పున మంజూరు చేసిన ఇండ్లకు అదనంగా రెండువేల ఇండ్లు తనకోటాలో మంజూరు చేస్తానని చెప్పారు.

మరోవైపు ఇంతకు ముందు గృహకల్ప ద్వారా నిర్మించిన ఇండ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన విధానం రూపొందించాలని కోరారు. గృహనిర్మాణంలో అవినీతికి తావివ్వరాదన్నారు. అసలైన పేదలను లాటరీ పద్ధతిలో అధికారులు ఎంపిక చేయాలని సూచించారు. మహిళల పేరుమీదనే ఇండ్లను కేటాయించాలని ఆదేశించారు. రైతులకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ అందించడానికి వీలుగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను ప్రజా ప్రతినిధులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం చెప్పారు. కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ నిర్మాణానికి అనువుగా స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ప్రభుత్వవిప్ గంపగోవర్దన్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏ జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్ గుప్తా, హనుమంతుషిండే, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, గంగాధర్ గౌడ్, జెడ్పీ చైర్‌పర్సన్ దఫెదార్‌రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.