ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట అందేలా..పంచాయతీ హబ్

-పంచాయతీరాజ్ బలోపేతానికి కృషి
-వడ్డీలేని రుణాలపై ఎవరినీ ఇబ్బంది పెట్టొదు: కేటీఆర్
-సెర్ప్ నిర్వహణ, పనితీరుపై మంత్రి సమీక్ష

KTR

ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట ప్రజలకు అందించే విధంగా పంచాయతీ హబ్‌లను ఏర్పాటు చేస్తే గ్రామీణాభివద్ధిలో అద్భుతాలు సష్టించొచ్చని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. అందుకోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. సెర్ప్ ద్వారా ఆదాయం పెరిగే పథకాలను రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు తమ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే ప్రపంచ బ్యాంకు ద్వారా టీఆర్‌ఐజీపీ పథకానికి రూ.1000 కోట్ల నిధులు, ఎన్‌ఎల్‌ఆర్‌ఎం పథకం ద్వారా మరో రూ.450 కోట్ల నిధులు రాష్ర్టానికి అందనున్నాయని చెప్పారు. ఈ నిధుల విడుదలపై త్వరలో ఢిలీ వెళ్లి బ్యాంకు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు చెప్పారు.

సచివాలయంలో పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్) నిర్వహణ, పనితీరుపై గ్రామీణాభివృద్ధి, సెర్ప్ ఉన్నతాధికారులతో కేటీఆర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి సమాంతరంగా సెర్ప్ సంస్థ విధులను నిర్వహించడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెర్ప్ ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థగా కాకుండా అనుసంధానంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కొక్క గ్రామంలో సెర్ప్‌కు సంబంధించిన 29 మంది అధికారులు పనిచేయడంపై కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను సున్నితంగా మందలించినట్లు సమాచారం.

సెర్ప్ సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ పనితీరును కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. కరీంనగర్ జిల్లా సెర్ప్ కార్యాలయంలోని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సిరిసిల్ల మండలం వ్యక్తిగా పరిచయం చేసుకొని, ఉద్యోగి పనితీరును పరిశీలించారు. సెర్ప్‌లోని వివిధ విభాగాలకు వేర్వేరు టోల్‌ఫ్రీ నంబర్లకు బదులు అన్ని సేవలకు ఒకే నంబర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ సిబ్బందికి పథకాల అమలులో సెర్ప్ అధికారులు సహకరించాలని సూచించారు. అధికారులు చేసే పనితీరుతో ప్రభుత్వంపై ప్రజలకు తప్పడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

సెర్ప్ ద్వారా చేపడుతున్న పథకాల లబ్ధిదారుల వివరాలపై అధికారులు ఇచ్చిన సమాచారంపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేసిన కేటీఆర్ వాటిని సవరించాలని సూచించారు. వడ్డీలేని రుణాల విషయంలో అధికారులు ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం అమలు చేసిన బంగారుతల్లి, బాలబడి, కృషి పథకంలాంటి పథకాలను కొనసాగిస్తూనే వాటికి అవసరమైన మెరుగులుదిద్దుతామని చెప్పారు. బంగారుతల్లి పథకం బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు.

డ్వాక్రా సంఘాల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పెంపుపై పరిశీలిస్తామని చెప్పారు. స్వయం సహాయక బృందాల గ్రామ సమాఖ్యలకు అన్ని సౌకర్యాలతో కూడిన సొంత భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ-పంచాయతీల పనితీరు అధ్యయనానికి త్వరలో కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ చెప్పారు.

సెర్ప్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
అంతకుముందు సెర్ప్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ సమస్యలపై మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారుల పనితీరువల్ల వేతనాలు ఆలస్యం కావడమే కాకుండా, బీమా పాలసీ ప్రీమియం గడువు ముగిసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సెర్ప్ డైరక్టర్ సుమిత్ర పనితీరుపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ సెర్ప్ ఉద్యోగుల బకాయి వేతనాలను చెల్లించాలని, బీమా పాలసీ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో అనాథ వృద్ధుల సౌకర్యార్ధం ఆశ్రమాల ఏర్పాటు చేసే విషయంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల మరణించిన నల్లగొండకు చెందిన ఇద్దరు సెర్ప్ ఉద్యోగుల స్థానాల్లో వారి కుటుంబసభ్యుల్లో అర్హత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను సూచించారు.