ప్రభుత్వ దవాఖానాలను ఆధునీకరిస్తాం..

-కార్పొరేట్ స్థాయికి అభివృద్ధిచేస్తాం
-ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగాలు కలిసి పనిచేయాలి: సీఎం కేసీఆర్
-సీఎం సహాయనిధికి కేర్ ఆస్పత్రి రూ.50లక్షల సాయంKCR

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎంతటి తీవ్రమైన వ్యాధులకైనా హైదరాబాద్‌లో చికిత్స అందేలా వైద్యప్రమాణాలను పెంచాలని ప్రైవేటు దవాఖానాల యాజమాన్యాలకు సూచించారు. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగాలు కలిసి పనిచేయాలన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి కేర్ దవాఖాన చైర్మన్ డాక్టర్ సోమరాజు రూ.50 లక్షల చెక్‌ను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమరాజుతోపాటు కాంటినెంటల్ దవాఖానాల చైర్మన్ టీ రఘునాథరెడ్డి, చైర్మన్ గురు ఎన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలోని కొన్ని దవాఖానాలు అధునాతన వైద్యాన్ని అందిస్తున్నాయని వీటిపై విస్తృత ప్రచారం చేయాల్సి ఉందని ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలకు సీఎం సూచించారు. హైదరాబాద్ మాస్టర్‌ప్లాన్‌లో దవాఖానాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డునే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల కూడా సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో మాసాయిపేట వంటి ఘటనలు జరిగినప్పుడు, జిల్లాలనుంచి వచ్చేవారికి సమయం కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు.