పీపీఏల రాద్ధాంతాన్ని తిప్పికొట్టాలి

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను సమర్థంగా తిప్పికొట్టి తెలంగాణ వాటా రాబట్టేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఏపీ జెన్‌కో పీపీఏల రద్దు కోసం ఆంధ్రా సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని, అలాంటి కుట్రలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేయాలని సూచించినట్లు సమాచారం. పీపీఏల వివాదానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో విద్యుత్, పరిశ్రమలు, రుణమాఫీ అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించారు. పీపీఏల వివాదం, విద్యుత కొరతపై జరిపిన సమావేశానికి జెన్‌కో సీఎండీ డీ ప్రభాకరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

KCR 002

రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఇప్పుడున్న విధి విధానాల్లోని లోపాలను సవరించి సరికొత్త ఆకర్షిత ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికార సమావేశంలో తీసుకోవాల్సిన చర్యల గురించి విపులంగా చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, రాయితీలు, విధి విధానాల గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్, దాని చుట్టూనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు పారిశ్రామీకరణ విస్తరించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా పరిశ్రమలకు చాలా సరళమైన పద్ధతిలో అనుమతులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణమైన విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవేత్తలను విమానాశ్రయం నుంచి సాదరంగా స్వాగతించి 15 నుంచి 20 రోజుల్లో అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలోనే చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమున్న విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు గుర్తించి వాటిలో పరిశ్రమలు స్థాపించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఏపీఐఐసీలో తెలంగాణ డివిజన్‌గా కొనసాగుతుండటంతో తెలంగాణకు టీఎస్‌ఐఐసీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు వచ్చే విధంగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు సాగాలని సీఎం అభిప్రాయపడ్డారని సమాచారం. వరంగల్, సిరిసిల్ల ప్రాంతాలను టెక్స్‌టైల్ పార్కులుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు తిరుపూర్ తరహాలో టెక్స్‌టైల్ పార్కు మాదిరిగా తెలంగాణ టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధిపర్చాలన్నారు.

ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ తెలంగాణ అనే అంశంపై సదస్సు నిర్వహించి పారిశ్రామికవేత్తలను, సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఏయే జిల్లాల్లో ఎలాంటి పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నాయన్న అంశంపై నివేదికను కోరారు. వాటిద్వారా ఉద్యోగావకాశాలు, రెవెన్యూ ఏ స్థాయిలో ఉంటాయోనన్న దానిపై కూడా చర్చించారు. మొత్తంగా పెట్టుబడివర్గాలకు తెలంగాణలో రెడ్‌కార్పెట్ వేయాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములపై పునఃసమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించింది. కంపెనీలకు కేటాయించగా నిరుపయోగంగా ఉన్న భూములను వెనుకకు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామన్న షరతులను పట్టించుకోనివాటిపై కూడా చర్యలు తప్పవన్న వైఖరి స్పష్టమైంది. తెలంగాణ సమగ్రాభివద్ధికి దోహదపడే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పన ఉండాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

రైతుల రుణమాఫీ అంశానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యమిస్తున్నారు. వేగంగా అమలుచేయాలని భావిస్తున్నారు. రుణ మాఫీ వల్ల ఏర్పడే ఆర్థిక భారం, ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది? ఏయే రుణాలు ఎన్ని కోట్లున్నాయి వంటి అంశాలన్నింటిపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో విపులంగా చర్చించారు. వ్యక్తిగత రైతుల సంఖ్య, గ్రూపులవారీగా ఇతర వివరాలన్నింటినీ సీఎం తెప్పించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిపై చర్చించేందుకు మంత్రులు అందుబాటులో ఉండాలని కోరారు. వారంలోపు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని, రుణమాఫీపై ప్రకటన చేసే ముందు ఒక స్పష్టతకు రావాలని సీఎస్‌ను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పటినుంచి అమలుచేయాలనేదానిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.