పౌల్ట్రీకీ వ్యవసాయ హోదా

-నష్టాల నుంచి బయటపడేస్తాం
-వరల్డ్ ఎగ్‌డే సమావేశంలో మంత్రి ఈటెల

etala-rajender
పౌల్ట్రీ రంగానికి త్వరలో వ్యవసాయ హోదా కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రంగాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోగా ఇచ్చిన హామీలను కూడా విస్మరించాయన్నారు. పౌల్ట్రీ రంగానికి 2014లోపు వ్యవసాయ హోదా కల్పించాలన్నది తమ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని అన్నారు. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా జాతీయ కోడి గుడ్ల సమన్వయ సంఘం, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి జలవిహార్ వరకు 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ప్రస్తుతం నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని లాభాల్లోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్లే ఈ పరిశ్రమకు నష్టం వాటిల్లిందన్నారు. వాణిజ్యపరమైన కోళ్ల పెంపకంతోపాటు నిరుపేద గ్రామీణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నదన్నారు. విద్యుత్ కోతల నుంచి పౌల్ట్రీ రంగాన్ని మినహాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని చెప్పారు.

పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో సుమారు 5లక్షల మంది ప్రత్యకంగాను పరోక్షంగాను ఉపాధి పొందుతున్నారని చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గుడ్డులో మరిన్ని పోషకాలుంటాయని, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఆహారంతో పాటు గుడ్డు తీసుకోవాలని కోరారు. రన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్, పశుసంవర్థక శాఖ సంచాలకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు,సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.