పోటాపోటీగా చెరువు పనులు

-ఊపందుకున్న మిషన్ కాకతీయ .. పూడిక మట్టి తరలింపునకు ముందుకొస్తున్న రైతులు

MP Vinod participated in Mission Kakatiya programme

చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది. తమ గ్రామ చెరువు పనులను ముందుగా పూర్తి చేయాలనే పట్టుదలతో పక్క గ్రామాల ప్రజలు పోటీపడుతూ పునరుద్ధరణలో పాల్గొంటున్నారు. పూడికను పొలాలకు తరలించేందుకు ట్రాక్టర్లు చాలక పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చి మట్టిని తరలిస్తున్నారు. వర్షపు చినుకు పడేలోపే పనులు పూర్తిచేయాలన్న ఉత్సాహంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా పనుల్లో పాల్గొంటున్నారు. సోమవారం వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని గొల్లచర్ల, మన్నెగూడెంలో చెరువు, నర్సంపేట శివారు గ్రామాలు, చెన్నారావుపేట మండలాల్లో, వర్ధన్నపేట చెరువు, మహబూబాబాద్ మండలం ఆమనగల్లులో, ములుగు డివిజన్‌లోని మంగపేటలో పనులు ప్రారంభమయ్యాయి. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పనులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బస్వాపూర్‌లో సోమయ్య చెరువు పనులను ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రారంభించారు.

గంభీరావుపేట మండలం నర్మలలో రామాజీ చెరువు పనులను జెడ్పీటీసీ సభ్యురాలు మల్లుగారి పద్మ, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి,మాజీ చైర్మన్ చిక్కాల రామారావులు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో ఉగాది నుంచి ఏదోఒక నియోజకవర్గంలో కొత్తగా పనులు మొదలవుతున్నాయి. సోమవారం ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లో మాసాని చెరువు పనులకు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి భూమి పూజ చేశారు. నిజాంసాగర్ మండలం గున్‌కుల్ ఊరచెరువు పనులను ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు ప్రారంభించారు. బోధన్ మండలం సంగంలో రూ.80 లక్షలతో కొండయ్య చెరువు, ఎడపల్లి మండలం పోచారం పెద్ద చెరువును రూ.42.90 లక్షలతో, నవీపేట మండలం పొతంగల్‌లోని రాళ్ల చెరువు రూ.30.60 లక్షలతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే షకీల్ ప్రారంభించారు. భీమ్‌గల్, మాచారెడ్డి మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి చెరువుల పనులను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం కల్కొడలో రూ.67 లక్షలతో చేపట్టిన చెరువు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇబ్రహీంపట్నంలో చెరువుల పునరుద్ధరణ విజయవంతం చేయడంపై నాయకులతో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సమావేశమయ్యారు.ఖమ్మం జిల్లా కల్లూరు, ఇల్లెందు, బోనకల్లు, రఘునాథపాలెం, టేకులపల్లి మండలాల్లో మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం ఎర్కారంలోని బీర్ల సముద్రం చెరువు, కేటీ అన్నారంలోని ఎర్రకుంట చెరువుల్లో పనులు మొదల య్యాయి. ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్‌లో రూ.46.15 లక్షలతో తుంగతుర్తి మండలం లక్ష్మీపురంలోని పెద్దచెరువు, బొమ్మలరామారంలోని నల్లచెరువు, పెద్దపర్వతాపూర్‌లోని మొరంకుంట పనులు ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముశ్రీఫా గ్రామ పికిడి చెరువు, సర్జఖాన్‌పేట ఆవాస గ్రామమైన ఈజీపూర్ లంగన్ చెరువు, బాలానగర్ మండలం సూరారంలోని నల్లచెరువు పనులు ప్రారంభమయ్యాయి.