పోరాడినోళ్లకే పీఠం

-టీఆర్‌ఎస్‌కు అండగా నిలువండి..
-రాష్ట్రం రాగానే పంచాయితీ పూర్తికాలేదు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-ఉద్యమస్ఫూర్తితో పునర్నిర్మాణం.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు
-పార్టీలో చేరిన ఎమ్మెల్యే వై ఎల్లారెడ్డి, విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి

KCR

ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారో వారే అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 14 ఏళ్లుగా ప్రత్యేకరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటంచేసిన టీఆర్‌ఎస్‌కే అండగా నిలువాలని ప్రజలను కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే వై ఎల్లారెడ్డి, ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడు పిడమర్తి రవి, వివిధ విద్యార్థి సంఘాల నేతలు, వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డి తదితరులు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి అపాయింటెడ్ డే రాగానే తెలంగాణ ప్రజల పంచాయితీ పూర్తి అయినట్టు కాదన్నారు. ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని, ఈ సమయంలోనే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

విభజన తమవల్లే సాధ్యమైందంటూ కొంతమంది టక్కుటమార విద్యలతో తెలంగాణ ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. వీరిపట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కీలకమైన తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఉద్యమస్ఫూర్తితో జరగాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ఈ పునర్నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ముగ్గురునుంచి నలుగురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల్లో కూడా విద్యార్థి నాయకులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఎల్లారెడ్డి నిజాయితీపరుడు..
ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మంచికి, నిజాయితీకీ, శాంతికి నిర్వచనంగా ఉంటారని కేసీఆర్ ప్రశంసించారు. ఎల్లారెడ్డి ఎన్నికల్లో నిలబడితే అక్కడి ప్రజలు ఆయనకు ఓటు వేయడమేగాకుండా బ్యాలట్‌పెట్టెకు కూడా దండం పెట్టుకుని వెళతారని చెప్పారు. మక్తల్ నియోజకవర్గంనుంచి ఆయనను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుపుతామని కేసీఆర్ ప్రకటించారు. ప్రజాబలంతో ఎల్లారెడ్డి సునాయసంగా గెలుపొందుతారన్నారు. ప్రస్తుత మక్తల్ నియోజకవర్గ బాధ్యుడు దేవర మల్లప్పకు ఎమ్మెల్సీ పదవిని ప్రథమ ప్రాధాన్యతగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు పార్టీ పొలిట్‌బ్యూర్‌లో స్థానం కల్పిస్తామన్నారు.

రవి చిచ్చరపిడుగు…
తెలంగాణ విద్యార్థి జేఏసీ ఛైర్మన్‌గా ఉన్న పిడమర్తి రవిని తానే పార్టీలోకి ఆహ్వానించానని కేసీఆర్ చెప్పారు.తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో రవి టైగర్‌లా వ్యవహరించిన చిచ్చరపిడుగని కొనియాడారు. ఉద్యమంలో ముందు నిలిచి విద్యార్థిలోకాన్ని ఉర్రూతలూగించారన్నారు. రాబోయే ఎన్నికల్లో రవిని పార్టీ అభ్యర్థిగా నిలిపి ఎమ్మెల్యేను చేస్తామన్నారు. విద్యార్థులు నడుంబిగించి రవిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఆమరణ దీక్షకు దిగినపుడు విద్యార్థిలోకం అద్భుతమైన ఉద్యమాలు చేపట్టిందన్నారు. పార్టీలో చేరుతున్న వరంగల్ టీడీపీ నేత ప్రేమలతారెడ్డి తనకు అత్యంత సన్నిహితురాలని చెప్పారు. తాము గతంలో ఒకే పార్టీలో కలిసి పనిచేసామని గుర్తు చేసుకున్నారు.

జడ్జీల ఎంపిక ఆపాలి..
కాగా, హైకోర్టులో జడ్జీల ఎంపిక కోసం కొలీజియం త్వరలో భేటీ కానుందని తెలిసిందని, తెలంగాణ పూర్తి స్థాయిలో ఏర్పడేవరకు ఈ ప్రక్రియను ఆపాలని హైకోర్టు చీఫ్ జస్టీస్‌ను కేసీఆర్ కోరారు. జడ్జీల నియామకాల్లో ఇప్పటికే తెలంగాణకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ కోర్టులలో ఉన్న 85 మంది జడ్జీల్లో అందులో 75 మంది సీమాంధ్రులే ఉన్నారని ఆయన వివరించారు. దీనిపై గురువారం ఆయనకు లేఖ రాస్తానని, ఇదే లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకీ కూడా పంపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, జగదీశ్వర్‌రెడ్డి, విద్యార్థి నాయకులు బాల్క సుమన్, విజయ్‌మోహన్, ఎమ్‌డీ రహీం, హుస్సేన్, ఎం నాగరాజు, కిషోర్, బుగ్లత్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన మొరిశెట్టి
సూర్యాపేటలోని 32వ వార్డు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త మొరిశెట్టి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం హైదరాబాద్‌లో గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీనివాస్ కౌన్సిలర్‌గా ఉన్న ఐదేళ్లలో ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు సూర్యాపేటలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేసి, వార్డు ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తూ తనదైన ముద్రవేసుకున్నారు.

-ఇంటి పార్టీకి విరాళం ఇవ్వండి
-టీఆర్‌ఎస్ డబ్బు సంచుల నుంచి పుట్టిందికాదు
-ఉద్యమం నుంచి వికసించిన గులాబీ పుష్పం

టీఆర్‌ఎస్ విజయానికి అందరూ ఆర్థికంగా సహకరించాలని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్.. ఉద్యమం నుంచి వికసించిన గులాబీ పుష్పమని, అన్ని పార్టీల మాదిరిగా డబ్బు సంచుల నుంచి పుట్టింది కాదని కేసీఆర్ చెప్పారు. ఇంటిపార్టీ కోసం తెలంగాణ ప్రజలు యథాశక్తి రూ.10, అంతకన్నా ఎక్కువగా విరాళాలు అందజేయాలని కోరారు. విరాళాలు అందజేయాలనుకున్నవారు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బ్యాంకు ఆఫ్ బరోడాశాఖలోని అకౌంట్ నంబర్ (266-101-00-00-2075)లో జమచేయాలని సూచించారు. కేసీఆర్ విజ్ఞప్తికి స్పందించిన వరంగల్ జిల్లా జనగామకు చెందిన ముడుపు రాజిరెడ్డి అక్కడికక్కడే పార్టీ ఎన్నికల నిధికి రూ.ఐదు లక్షల విరాళం ప్రకటించారు.

బ్యాంకు పేరు : బ్యాంక్ ఆఫ్ బరోడా,
బంజారాహిల్స్ శాఖ, హైదరాబాద్
అకౌంట్ నంబర్ :
266-101-00-00-2075