పొన్నాలా.. ఉద్యమంలో ఏడున్నవ్?

-14ఏండ్ల కింద కేసీఆర్ రాజీనామా చేయకపోతే తెలంగాణ వచ్చేదా..?
-మెదక్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి ఈటెల

Etela Rajendar

కడుపు మాడ్చుకున్నం.. ఎండు కారం తిన్నం… ఎండ, చలి, వానను లెక్క చేయక ఉద్యమాలు చేసినం. జైళ్లకు వెళ్లినం, రోడ్ల మీద, రైల్వే పట్టాల మీద పన్నం.. పదవులను గడ్డిపోచలా వదిలేసినం. రాజీనామా చేసిన ప్రతీసారి తెలంగాణ గడ్డ మమ్మల్ని అక్కున చేర్చుకుంది. మేం రాజీనామా చేసినప్పుడు నీవెక్కడున్నావ్..

మిస్టర్ పొన్నాల అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏండ్ల కిందట కేసీఆర్ రాజీనామా చేసి ఉండకపోతే తెలంగాణ వచ్చేదేనా..? అంటూ ప్రశ్నించారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంగునూరు మండలం ఖాత, కొండంరాజ్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయాగ్రామాల్లో మహిళలు మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ కింద 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆనాడు ఇదే పొన్నాల లక్ష్యయ్య అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అలాంటి వ్యక్తులు ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆకలి కేకలు లేని పచ్చని తెలంగాణను నిర్మించడమే మాముందున్న కర్తవ్యమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా ఏ ఒక్క పేద కుటుంబం రేషన్‌కార్డు తొలగించం.. ఇది పౌరసరఫరాల శాఖ మంత్రిగా నేను చెప్తున్నా అని పేర్కొన్నారు. ఫీజులకు, రేషన్ కార్డులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీమాంధ్ర పత్రికలు, మీడియా ఛానళ్లు కొన్ని తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.