పోలీసు బడ్జెట్‌పై కసరత్తు

– నేడు అధికారులతో మంత్రి ఈటెల సమీక్ష

Etela Rajendar
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పోలీసులకు అవసరమైన బడ్జెట్‌ను రూపొందించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర తొలి బడ్జెట్‌ను తయారుచేసేందుకు వివిధ శాఖల అధికారులతో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సమావేశం కానున్నారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాల నుంచి వారి అవసరాలను తెలుసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఆదివారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

తమ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు అంచనాలను అజమ్ మిశ్రాకు పోలీస్ అధికారులు అందజేశారు. ఈ సమావేశానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సౌమ్య మిశ్రా, ఆక్టోపస్ అదనపు డీజీ రాజీవ్ త్రివేది, సీఐడీ ఐజీ చారుసిన్హా, ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, గ్రేహౌండ్స్ ఐజీ విక్రంసింగ్‌మాన్‌లతో పాటు నవీన్‌చంద్, శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు. సోమవారం ఆర్థికమంత్రి, అధికారులతో జరిగే సమావేశంలో రాష్ట్ర పోలీసులకు కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను అజయ్ మిశ్రా, డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులు వివరిస్తారు.