ప్లీనరీకి 40 వేల మంది ప్రతినిధులు

-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
-ప్రభుత్వానికి సలహాలు, సూచనల కోసమే ప్లీనరీ
-దీనితో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్టమవుతుంది
-పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
-ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన

KTR addressing media on Party Plenary meeting

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ ప్లీనరీని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ నెల 24న నిర్వహించనున్న ప్లీనరీ సమావేశాల కోసం ఎల్బీ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్లీనరీతోపాటు ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభ కోసం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఎల్‌బీ స్టేడియం, పరేడ్ గ్రౌండ్‌లలో మంత్రి పద్మారావు నేతృత్వంలో వేదికలను ఏర్పాటు చేస్తున్నారని, ప్లీనరీ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని చెప్పారు. ప్లీనరీకి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తల చొప్పున మొత్తం 36వేల నుంచి 40వేల మంది వరకు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు.

ప్ల్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిరిగి ఎన్నుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ ప్లీనరీలో పార్టీ నాయకుల, కార్యకర్తలు వివిధ అంశాలపై సలహాలు, సూచనలిస్తారని, ప్రభుత్వానికి కూడా తగిన సూచనలు ఇవ్వవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై తగిన సూచనలను అందిస్తే వాటిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరం కలిసి సంబురాలు, విజయోత్సవాలు చేసుకోలేదని, ప్రస్తుతం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభతో తెలంగాణ విజయోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్లీనరీ, బహిరంగసభలను విజయవంతం చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారన్నారు. పార్టీ ప్రతినిధుల భోజనాలకు నిజాం కాలేజ్ మైదానంలో, పార్కింగ్‌కు వివిధ ప్రాంతాలను పోలీసులు గుర్తించడం జరిగిందని తెలిపారు.

నగర అలంకరణ, పార్కింగ్, భోజనాల ఏర్పాటు, మంచినీళ్ళు, ఎండకాలం నేపథ్యంలో కూలర్స్ ఏర్పాటు వంటి పూర్తి సౌకర్యాలతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను వేసి ఏర్పాట్లను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్లీనరీతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం అందరికీ స్పష్టమవుతుందన్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ సభ్యత్వ కార్యక్రమం టీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిరూపించిందని, ఇప్పటికే 41లక్షల మంది సభ్యులకు ప్రమాద బీమా చేయించామన్నారు. మిగతావారి డాటా ఎంట్రీ పూర్తికాగానే వారికీ చెల్లిస్తామని మంత్రి తెలిపారు. కేటీఆర్ వెంట ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, పార్టీ నేతలు జనార్దన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతారావు, సామ వెంకట్‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ప్రేమ్‌కుమార్‌ధూత్, సతీశ్‌రెడ్డి, ఆజం అలీ, ఆర్‌వీ మహేందర్, బొంతు రాంమోహన్, కన్నా, బాబా ఫసియొద్దీన్ తదితరులు ఉన్నారు.