ప్లీనరీతో.. సత్తా చాటుతాం

-నగరానికి అవకాశం ఇచ్చినందుకు
-సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
-కనీవినీ ఎరుగని రీతిలో సమావేశాలు నిర్వహిస్తాం
-హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
-నేటి నుంచి డివిజన్ ఎన్నికలు
-24లోపు పార్టీ గ్రేటర్ అధ్యక్షుడి ఎన్నిక
-గ్రేటర్ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి

TRS Pleenary Meeting

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు, ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ను గులాబీ వనంగా మారుస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ అడహక్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం వివిధ జిల్లాలకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి పార్టీ ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్‌కు ఇచ్చినందులకు కృతజ్ఞతలు తెలిపారు.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ప్లీనరీకి 36 వేల మంది కార్యకర్తలు, నాయకులు హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు. వీరికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వేదికను మంత్రి పద్మారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని వివరించారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, సిద్ధిపేట, నిజామాబాద్ రూట్ల నుంచి వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలకు స్వాగత తోరణాలు, బ్యానర్లు, కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రేటర్‌లో ప్రతి డివిజన్‌ను గులాబీ మయంగా మార్చేందుకు ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. డెకరేషన్ కోసం ప్రతి కార్యకర్త సహకరించాలని కోరారు. పార్కింగ్ కోసం ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంతో చర్చించి, తగిన స్థలాల ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు.

నేటి నుంచి డివిజన్ కమిటీలు..
టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటికే గ్రేటర్‌లో 1077 బస్తీ కమిటీలు ఏర్పాటైనట్లు ఆ పార్టీ గ్రేటర్ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ కమిటీల ద్వారా 42 వేలకు పైగా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించామన్నారు. బస్తీల్లో ప్రధాన కమిటీలతోపాటు అన్ని అనుబంధ కమిటీలను పూర్తి చేసుకున్నామని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 150 మున్సిపల్ డివిజన్లకు గాను పార్టీ కమిటీలకు ఎన్నికలను ఈ నెల ఆదివారం నుంచి 16 వరకు నిర్వహించనున్నామన్నారు.

ఇందుకోసం ముఖ్య నాయకులు, నిష్ణాతులను డివిజన్ ఎన్నికల అధికారులుగా నియమించినట్లు పెద్ది వెల్లడించారు. వీటిని సకాలంలో పూర్తి చేసి, ఈ నెల 24వ తేదీ నాటికి గ్రేటర్ కమిటీని సైతం ప్రకటించుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ అడహక్ కమిటీ గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, రాష్ట్ర సభ్యత్వ కమిటీ సభ్యులు పురాణం సతీష్‌కుమారు, కోఆర్డినేటర్ పుటం పురుషోత్తంరావు, షబ్బీర్ ఆహ్మద్, కపిల్‌రాజ్ పాల్గొన్నారు.