ప్లకార్డులతో రోజంతా నిరసన

-హైకోర్టు విభజన కోసం పట్టువీడని టీఆర్‌ఎస్ ఎంపీలు
-అఖిలపక్షం సమావేశంలోనూ చర్చ

MP's Protest in Loksabha

హైకోర్టు విభజనను డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు సోమవారం కూడా లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు. ట్రెజరీ బెంచీల ముందు ప్లకార్డులు పట్టుకుని ఉదయం మొదలు సభ ముగిసేంత వరకు నిలబడే ఉండి నిరసన తెలియజేశారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులంతా టీఆర్‌ఎస్ ఎంపీల నిరసనను గమనిస్తూనే ఉన్నారు. స్పీకర్ పోడియం ముందు కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా టీఆర్‌ఎస్ ఎంపీలు మాత్రం మౌనంగానే ప్ల్లకార్డులతో నిరసనను కొనసాగించారు. ప్రధాని స్వయంగా లోక్‌సభలో హైకోర్టు విభజనపై స్పష్టమైన ప్రకటన చేసేంతవరకూ ఈ నిరసనను వదిలే ప్రసక్తే లేదని ఎంపీలు స్పష్టం చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు హైకోర్టు విభజనకు అవసరమైన చర్యలను చేపట్టారు. అయితే మాటల్లో కాకుండా చేతల్లో ఫలితం కనిపించేంతవరకు నిరసనను కొనసాగిస్తామని అఖిలపక్షం సమావేశం సందర్భంగా లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

నిరసన గురించి జితేందర్‌రెడ్డి నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం కేసులు, జైళ్ళు, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నామని, ప్రస్తుత ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు నాయకత్వంలో పన్నెండేండ్లు పోరాడి.. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నా.. దురదృష్టవశాత్తూ ఇప్పుడు హైకోర్టు విభజన కోసం కూడా ఆందోళన చేయాల్సి వస్తున్నదని అన్నారు. అఖిలపక్షం సమావేశంలో జరిగిన వివరాలను వెల్లడిస్తూ, హైకోర్టు విభజన విషయంలో టీఆర్‌ఎస్ వైఖరిని స్పష్టం చేశామని, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ అంశంలోని నిజాయితీని గమనించారని, సానుకూలంగా స్పందించారని జితేందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, హైకోర్టు విభజన విషయంలో టీఆర్‌ఎస్ ఎంపీలుగా చేస్తున్న ఆందోళనను యావత్తు దేశం గమనిస్తున్నదని అన్నారు.

అయితే.. సభలో ఇలా నిరసన తెలియజేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. దీనికి ఘాటుగానే స్పందించిన జితేందర్‌రెడ్డి, తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు విషయంలో జరిగిన అన్యాయాన్ని కూడా యావత్తు దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారని, రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటినా రాజ్యాంగం ప్రకారం హైకోర్టును ఇంకా ఏర్పాటు చేయలేదన్న విషయాన్ని కూడా ప్రజలు నిశితంగానే గమనిస్తూ ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన డిమాండ్ తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని, అందువల్లనే ఉదయం మొదలు సాయంత్రం వరకు కాళ్ళు నొప్పిలేస్తున్నా నిలబడి మౌనంగా ప్లకార్డులతోనే నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. న్యాయశాస్ర్తాన్ని చదివిని అరుణ్‌జైట్లీకి సైతం రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక స్వంత హైకోర్టు ఉండాలన్న విషయం తెలుసునని జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాల్సిన హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ విషయంలో మౌనం వీడి సమాధానం చెప్పాలని కోరారు.

నేడు అరుణ్‌జైట్లీతో భేటీ:
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 31 రెండు కొత్త రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఉండాలని స్పష్టంగా పేర్కొన్నదని జితేందర్‌రెడ్డి వివరించగానే ఆ అంశంపై మాట్లాడడానికి ఒకసారి సమావేశం అవుదామని జైట్లీ సూచించారు. అందులో భాగంగా జితేందర్‌రెడ్డితో పాటు ఎంపీ బీ వినోద్‌కుమార్ మంగళవారం ఉదయం అరుణ్‌జైట్లీతో భేటీ కానున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండు రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయడానికి నిర్దిష్టంగా సమయాన్ని పేర్కొన్నారా? అని జితేందర్‌రెడ్డిని జైట్లీ అడిగారు. ఈ విషయమై స్పష్టత రావడం కోసం మంగళవారం ఉదయం సమావేశం జరగనుంది.

త్యాగాలకు వెరవం: డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
రాష్ట్ర సాధన కోసం అకుంఠిత దీక్షతో ఉద్యమం చేసిన తరహాలోనే ఇప్పుడు హైకోర్టు విభజన అంశంలోనూ నిరసనను లోక్‌సభలో కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఎవరి వల్ల హైకోర్టు విభజనకు ఆటంకం కలుగుతూ ఉందో ఆ వ్యక్తికే హైకోర్టు విభజన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న అంశాన్ని స్పష్టం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన తీరులో తమను కూడా సస్పెండ్ చేసినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం తన విధి నుంచి తప్పుకోవాలని చూస్తే అందుకు తగిన పోరాట రూపాలను ఎంచుకుంటామని అన్నారు. కొద్దిమంది న్యాయమూర్తులు సంసిద్ధత చూపని కారణంగానే హైకోర్టు విభజనను చేయడంలేదన్న వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక హైకోర్టు ఉండాలని, తెలంగాణ అంశంలోనూ ఇది కొనసాగాల్సిందేనని అన్నారు. న్యాయమూర్తులు కూడా వారికి ఎక్కడ పని చేయాలని ఉత్తర్వులు వస్తే అక్కడ పని చేయాల్సిందే తప్ప వారు సంసిద్ధంగా లేరన్న కారణాన్ని సాకుగా చూపి విభజన చేయడం లేదని ఎవరు భావించినా అది సమంజసం కాదని అన్నారు.