పిడికెడు బొగ్గులేని ఆంధ్రలో మిగులు విద్యుత్తా?

-పుష్కల వనరులున్న తెలంగాణలో సంక్షోభమా
-కేంద్ర మంత్రి పీయూష్‌ను నిలదీసిన ఎంపీ వినోద్

MP Vinod

పిడికెడు బొగ్గు కూడా దొరకని ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉండగా.. పుష్కలంగా బొగ్గు నిక్షేపాలున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎలా ఉంటుంది..? అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటని నిలదీశారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ పదేపదే తెలంగాణ రాష్ట్రం కేంద్రం కోటా నుంచి విద్యుత్‌ను అందించాలని కోరినా ఎందుకు ఇవ్వడం లేదు..? తమ విజ్ఞప్తులపై ఏ చర్యలు తీసుకున్నారని మంత్రిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పొగుడుతున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి సమాధానం చెప్పాలని నిలదీశారు. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్తున్న కేంద్ర మంత్రి ఇప్పటివరకు రాష్ర్టాలతో ఈ అంశానికి సంబంధించి భాగస్వామ్యం కుదుర్చుకోడానికి చేసిన ప్రయత్నాలేమిటని నిలదీశారు. దీనికి మంత్రి స్పందిస్తూ… కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ర్టాలూ సమానమేనని, అన్ని రాష్ర్టాల్లాగానే తెలంగాణకు కూడా సమ ప్రాధాన్యతే ఇస్తున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఆ పనిలోనే ఈ బృందం నిమగ్నమై ఉందని మంత్రి వివరించారు. రానున్న నాలుగు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రం కూడా మెరుగైన స్థానంలో ఉంటుందని, తాము రూపొందించే కార్యాచరణ ప్రణాళిక ఇప్పటి పరిస్థితిని మెరుగుపరుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అవసరమైన భూమిని సమకూర్చడంలో సదురు ఎంపీ చొరవ తీసుకోవాలని కోరారు. అంతకుముందు వివిధ రాష్ర్టాలకు ఇచ్చిన కేంద్ర విద్యుత్ కోటా వివరాలను వినోద్ అడిగారు. దీనికి మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ, తెలంగాణ రాష్ట్రం జఝ్జార్‌లోని ఇందిరాగాంధీ విద్యుత్ కేంద్రం నుంచి 226 మెగావాట్ల విద్యుత్‌ను అడిగితే కేంద్రం 221 మెగావాట్లను ఇచ్చిందని, కూడంకుళంలోని అణువిద్యుత్ కేంద్రం నుంచి 300 మెగావాట్ల అడిగితే 50 మెగావాట్లను ఇచ్చిందని, ఎవ్వరికీ కేటాయించకుండా కేంద్రం దగ్గర ఉన్న విద్యుత్‌లో 500 మెగావాట్లను అడిగితే 40 మెగావాట్లను ఇచ్చామని తెలిపారు.