పెట్టుబడుల స్వర్గధామం

– ఐటీ, ఏరోస్పేస్‌కు హైదరాబాద్ ఎంతో అనుకూలం
– డల్లాస్‌లో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు
-ఐటీ సర్వ్ అలయెన్స్‌పై 150 ఐటీ కంపెనీలతో సమావేశం
– వైబ్రంట్ హైదరాబాద్, మీట్ అండ్ గ్రీట్‌లో ప్రసంగాలు
-రాష్ట్రఅభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎన్నారైలకు పిలుపు
– మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్‌కు రెండు లక్షల డాలర్లు
– భూరి విరాళం ప్రకటించిన ఎన్నారైలు

KTR 01
హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామం వంటిదని రాష్ట్ర పంచాయతీరాజ్,ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఐటీ, ఏరోస్పేస్, హెల్త్, ఫార్మా, ఎడ్యుకేషన్, మ్యానుఫాక్చరింగ్ రంగాలకు అత్యంత అనుకూలమని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెచ్చిందని, పారిశ్రామికవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని ఆయన వివరించారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం వచ్చే రెండేండ్లలో విద్యుత్ ఉత్పత్తి రెట్టింపు చేస్తున్నామని, యువతను సాంకేతికంగా తీర్చి దిద్దేందుకు టీ-హబ్ ద్వారా కృషి జరుపబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన కేటీఆర్ తమ ప్రభుత్వం పరిశ్రమల కోసం ఇప్పటికే 1.50 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేశామని చెప్పారు.

అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ నగరంలో ఆదివారం వివిధ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొని తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధికి జరుపుతున్న కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పారిశ్రామికవేత్తలు వెలుబుచ్చిన సందేహాలకు సమాధానాలు ఇచ్చా రు. పలు పరిశ్రమల సీఈవోలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో సరిపడ విద్యుత్, నీరు, భూమి ఉంద ని, పెట్టుబడుల సౌకర్యార్థం నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా ప్రవేశపెట్టామని చెప్పారు. హైదరాబాద్‌కు డల్లాస్ ఆదర్శ నగరమని సీఎం కేసీఆర్ చెబుతుంటారని తెలిపారు. ఇదే పర్యటనలో తెలంగాణ ఎన్నారైలతో జరిపిన సమావేశంలో ప్రభు త్వం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా డల్లాస్‌లో ఉన్న ఎన్నారైలు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు, మిషన్ కాకతీయకు రెండు లక్షల అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకువచ్చారు.

KTR 0666

రాష్ట్రంలో అత్యుత్తమ సౌకర్యాలు..: పిట్స్‌బర్గ్ నుంచి డల్లాస్ చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు డల్లాస్ విమానాశ్రమయంలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం, తెలంగాణ ఐటీ అసోసియేషన్, టాటా సంస్థల ప్రతినిధులతో పాటు వందలాది మంది ఎన్నారైలు మంత్రికి స్వాగతం పలికారు. డల్లాస్ సిమా క్లబ్‌లో ఏర్పాటు చేసిన పెట్టుబడుదారుల విందు సమావేశానికి కేటీఆర్ బృందం హాజరైంది. ఈ సందర్భంగా పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడుల అంశంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల ధోరణితోపాటు రాష్ట్రంలో ఉన్న పలు పెట్టుబడి అవకాశాలను మంత్రి వివరించారు. పెట్టుబడులతో తమ రాష్ర్టానికి వచ్చే వారికి దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా అత్యుత్తమ సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

అనంతరం డల్లాస్‌లోని 150 ఐటీ కంపెనీలు కలిసి ఏర్పాటుచేసిన ఐటీ సర్వ్ అలయెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ చిన్న, మాధ్యమిక కంపెనీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అందించే రాయితీలు, సౌకర్యాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధితో పాటు తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తిని నాలుగింతలు చేయనున్నట్లు వివరించారు. విద్యార్థులు, యువతను నిపుణులుగా రూపొందించే దిశగా టీహబ్ ద్వారా వారి భవిష్యత్తుకు రెక్కలు తొడుగుతున్నామని తెలిపారు. ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని వివరిస్తూ తక్కువ ప్రమేయం-అత్యధిక సౌకర్యం అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక పాలసీని రూపొందించిందని మంత్రి వివరించారు. ఇది దేశంలో విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమని ఆయన అభివర్ణించారు.

వైబ్రంట్ హైదరాబాద్..: అనంతరం మంత్రి కేటీఆర్ వైబ్రంట్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పెట్టుబడుల అవకాశాలను, నగరానికి ఉన్న ప్రత్యేకతలను వివరించారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాలను తెలిపారు. ఈ దిశగా ఐటీతో పాటు ఏరోస్పేస్ మరియు రక్షణ రంగాలకు ప్రాధాన్యతనిచ్చి ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపినట్లు వివరించారు. ఆ రంగాల్లో ఇప్పటికే హైదరాబాద్ ముందు వరసలో ఉందని చెప్పారు. మొత్తంగా హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంటుందని తెలిపారు. డల్లాస్ నుంచి బయలుదేరే ముందు అక్కడి ఎన్నారైలతో మీట్ ఆండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ బృందం పాల్గొంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను సోదాహరణంగా వివరించిన కేటీఆర్ మాతృరాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన డల్లాస్‌లోని తెలంగాణ బిడ్డలు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, మిషన్ కాకతీయకు రెండు లక్షల అమెరికన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు.తర్వాత అమెరికాలోని ఇండియా రాయబారి అరుణ్‌సింగ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సహకారం అందజేయాలని ఆయనను కోరారు.