పెట్టుబడులకు స్నేహహస్తం

-వరంగల్, కరీంనగర్‌లో ఐటీ పరిశ్రమలు
-సీఎం నిర్ణయాలతో రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు
-నాస్కామ్ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

KTR-02
పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక సంస్థలకు స్నేహహస్తం అందిస్తామని, ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం గురువారం గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని సియెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థలో నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు విడుతలుగా జరిగిన ఈ సమావేశంలో ఉదయం చంద్రబాబు, మధ్యాహ్నం జరిగిన సెషన్‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలను, పరికరాలను కేసీఆర్ పరిశీలించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అనుకూలంగా ఉన్న వనరులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణను మంత్రి కేటీఆర్ నాస్కామ్ కౌన్సిల్ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

సమావేశ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులతో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీఇచ్చారు. పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టబుడులు పెట్టడానికి వస్తున్నాయన్నారు. ప్రభుత్వం పూర్తి ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటుందని నాస్కామ్ ప్రతినిధులకు కేటీఆర్ తెలిపారు. మహిళలు, ఉద్యోగినిల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో మహిళా రక్షణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇతర దేశాల్లో మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేయనున్నట్లు చెప్పారు. వారం, పదిరోజుల్లోపు ఐటీ కారిడార్ ప్రాంతంలో పూర్తిస్థాయి మహిళా పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన అనుభవం ఉన్న కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉండటంతోరాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మరింత ముందుకువెళ్తుందన్న ఆశాభావాన్ని నాస్కా మ్ ఉపాధ్యక్షుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి వ్యక్తంచేశారు.