పెండ్లికి ముందే 51వేలు చెల్లిస్తాం

-గుడి, ఆర్యసమాజ్‌లో పెండ్లి చేసుకున్నా కల్యాణలక్ష్మి వర్తింపజేస్తాం
-ఈ పథకానికి సాధారణ నిబంధనలే: మంత్రి ఈటల
-కల్యాణలక్ష్మి పథకం.. అద్భుతమన్న పార్టీలు
-ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి గురించి ఆలోచిస్తామని అసెంబ్లీలో ఈటల వెల్లడి
కల్యాణలక్ష్మి పథకానికి ఇప్పటికే విధివిధానాలు వచ్చాయని, 18 ఏండ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులు ఈ పథకానికి అర్హులని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెళ్లికి నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమయంలో రెండు లక్షల లోపు ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను సమర్పించాలని తెలిపారు.

Etela Rajendar 01

పెండ్లికి ముందే ప్రభుత్వం ఈ పథకం కింద రూ.51వేలు చెల్లిస్తుందన్నారు. గుడి, ఆర్యసమాజ్‌లో చేసుకున్న పెండ్లిళ్లకు కూడా వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బొడిగే శోభ అడిగిన ప్రశ్నకు ఈటల సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆయన నియోజకవర్గంలో ఎన్నోసార్లు సామూహిక వివాహాలు జరిపించారని ఈటల గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖకు రూ.150కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.80కోట్లు, షాదీ ముబారక్‌కు రూ.100కోట్లు కేటాయించామని, అవసరాన్ని బట్టి పెంచుతామన్నారు.

బీసీ వర్గాలను కల్యాణలక్ష్మి పథకంలోకి చేర్చాలనే విషయంపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికే సీఎం ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారని, ఎంబీసీల సమస్యలపైనా అందులో చర్చిద్దామని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేలు పెళ్లిపందిట్లో అందించే రోజు రాబోతున్నదని ముఖ్యమంత్రి కూడా అన్నారని పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్, కుల, ఆదాయ సర్టిఫికెట్ ఉండి ఎమ్మార్వో కార్యాలయంలోనైనా, ఆన్‌లైన్‌లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పెళ్లిండ్ల సీజన్ మొదలైతే ఈ పథకం గురించి ప్రజలకు తెలుస్తుందన్నారు. ఇప్పటి వరకు నల్లగొండలో నాలుగు, వరంగల్ నుంచి ఒక్క దరఖాస్తు వచ్చిందని అన్నారు.

బంగారుతల్లికి బదులుగానే కల్యాణలక్ష్మి
బంగారుతల్లి పథకాన్ని గత ప్రభుత్వం, గత రాష్ట్రంలో పెట్టారని.. దీని బదులుగానే కల్యాణలక్ష్మి వచ్చిందని ఆర్థిక మంత్రి అన్నారు. ఇప్పటికే బంగారుతల్లి పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి విషయంపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోనే పోయిందన్నారు. సామూహిక వివాహాలు జరిపితే ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తుందని తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడటంతో ఈటల స్పందిస్తూ బంగారుతల్లిపై చర్చించాలనుకుంటే షార్ట్‌నోటీసు, కాలింగ్ అటెన్షన్, 344కింద నోటీసు ఇవ్వాలని, సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఈటెల స్పందిస్తూ సభ్యులు అడిగిన ప్రశ్నకు బంగారుతల్లికి సంబంధం లేకున్నా సమాధానం చెప్పాం. అయినా, నిరసన అంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ.51వేలు చెల్లిస్తుంటే ప్రతిపక్షాలకు ఇబ్బందిగా ఉందా..? అని ప్రశ్నించారు. ఇదే విషయంపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. సభ్యుల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పని సందర్భంలోనే నిరసన తెలపాలి. అంతేకానీ సభలో అడిగిన ప్రశ్నకు సంబంధం లేకుండా మరో విషయాన్ని ప్రస్తావించి.. నిరసన తెలుపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

దళిత సంక్షేమం లెక్కల సంక్షేమంగా ఉండేది
గతంలో దళిత సంక్షేమం లెక్కల సంక్షేమంగా ఉండేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దళిత యువతులకు రూ.51వేలు చెల్లించడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కల్యాణలక్ష్మి పథకం అద్భుతంగా ఉందని, గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ ఈ పథకంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ పథకం చాలా మంచిదని, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో విజయవంతమైందన్నారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించాలని, ఇందుకోసం కల్యాణ మండపాలు నిర్మించాలని కోరారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ దళితులకు కల్యాణలక్ష్మి ఓ వరమని, సిక్కులకు కూడా ఇస్తామని సీఎం తెలుపడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వైశ్యుల్లో కూడా నిరుపేదలున్నారని, వారికి కూడా వర్తింపచేయాలని కోరారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ కేసీఆర్ మనసున్న మహారాజు అని అన్నారు. కేసీఆర్ చేసే పనులు ప్రజల మనుస్సుల్లో నిలిచిపోతాయని తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ బంగారు తల్లి పథకాన్ని ఏం చేస్తారో చెప్పాలని అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకంలో చాలా నిబంధనలు ఉన్నాయని.. చెక్కు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదని అన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న తరువాత చెక్కు ఎప్పుడిస్తరో చెప్పాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అన్నారు. ఈ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, దళితులకు మంచి పథకమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. అమ్మాయి పుట్టిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే డిగ్రీలో రూ.50వేలు వస్తాయని, దీనికన్నా కల్యాణలక్ష్మి మంచి పథకమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సామూహిక పెండ్లిళ్లు నిర్వహించి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యేలా చూడాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి కంటే బంగారుతల్లే మంచి పథకమని.. దానినే కొనసాగించాలని అన్నారు.