పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై స్పీడు పెంచాలి

-రాష్ర్టానికి రావాల్సిన కేంద్ర నిధులకోసం కృషి చేయండి
-రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన
-స్టేషన్ల ఆధునీకరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోండి
-కొత్త లైన్ల ఏర్పాటులో వేగంగా స్పందించండి
-కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి స్థలం కేటాయిస్తాం
-బిల్లులో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీ నిజం కావాలి
-కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపాం..
-వాటి అమలుకు కూడా చొరవ చూపండి
-జీఎం శ్రీవాత్సవ, అధికారులతో సమీక్షలో సీఎం

KCR with Railway GM

రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను తొందరగా పూర్తిచేయాలని రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులను రప్పించేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ, ఇతర ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం సచివాలయంలో రైల్వే సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ఆయన రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలు, ప్రతిపాదనలపై ప్రధానికి లేఖ రాశామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తున్నదనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుని తెలంగాణకు మేలు చేకూర్చే విధంగా చూడాలని కోరారు. మనోహరాబాద్ – కొత్తపల్లి, పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వే లైన్ల ఏర్పాటు విషయంలో వేగంగా స్పందించాలని సూచించారు. కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా మార్చే అంశంపై కేంద్రాన్ని కోరామని, దీని విషయంలో రైల్వే అధికారులు చొరవ చూపాలని అన్నారు.

కాజీపేటలో నిర్వహించతలపెట్టిన వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని, పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీకీ సంబంధించిన ప్రతిపాదనలు కూడా వాస్తవరూపం దాల్చే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. వ్యాగన్ ఫ్యాక్టరీకీ అవసరమైన భూమి కేటాయించే విషయంపై అప్పటికప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి మాట్లాడారు. భూమి సిద్ధం చేయాలని ఆదేశించారు. భూమి అందుబాటులోకి రాగానే పనులు ప్రారంభించాలని అన్నారు.

ఎంఎంటీఎస్‌ను తూప్రాన్ వరకు పొడిగించాలి
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ప్రత్యేకంగా చర్చించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన కొత్త ప్రాజెక్టులపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలో రైల్వే ట్రాన్సుపోర్టు సిస్టంను బాగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పూర్తిగా మార్చాలని, ఆధునీకరించాలని అన్నారు. ఎంఎంటీఎస్ రెండోదశను తూప్రాన్ వరకు పొడిగించాలని కోరారు.

ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ వరకు ట్రాక్ నిర్మించి లోకల్ రైలు నడుపాలని సూచించారు. నగరంలో అన్ని ఎంఎంటీఎస్ వ్యవస్థలను పటిష్ఠపరిచేందుకు కనెక్టివిటీ ట్రాన్స్‌పోర్టేషన్‌ను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని చెప్పారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ప్రభావం పడకుండా మౌలాలి, నాగులపల్లి టర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఎంఎంటీఎస్ వ్యవస్థను మెరగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.

రవాణాశాఖ నుంచి రావాల్సిన అనుమతుల కోసం కృషి చేయాలని కోరారు. వీటితోపాటు జంటనగరాలలో ట్రాఫిక్‌ను తగ్గించడానికి రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీల అవసరంపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖ మంత్రి టీ పద్మారావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.