పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి

– త్వరితగతిన పూర్తయ్యేవాటికి ప్రాధాన్యం
– పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనుల ప్రారంభానికి నిర్ణయం
– సాగునీటి రంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
– బేసిన్ ప్రకారం వాటా కావాలి..
– కేంద్రానికి నివేదించనున్న రాష్ట్రప్రభుత్వ బృందం

Harish Rao
పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించనుంది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి పదింటి వరకు సుదీర్ఘంగా జరిగింది. సమావేశంలో కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావు, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నతస్థాయి అధికారులు, సీనియర్ ఇంజినీర్లు , సలహాదారు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతోపాటు దుర్భిక్ష ప్రాంతాలకు నీటివసతి కల్పనకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలనే ధృడసంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన జిల్లాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలోని భూములకు సాగు నీరందించేందుకు తక్షణ కార్యాచరణ రూపొందించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 12 మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వాల మాదిరిగా దీర్ఘకాలిక ప్రాజెక్టుల నిర్మాణాల జోలికిపోకుండా, నిర్ణీతకాలావ్యవధిలో సత్వరమే పూర్తయ్యే ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని సాగునీటి అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

ప్రాజెక్టు పనులతోపాటు తెలంగాణ నీటిపారుదలకు ఆయువుపట్టులాంటి చెరువులు, కుంటల అభివృద్ధ్దికి ప్రణాళికలపైనా సమావేశంలో చర్చించారు. గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 36 వేల 340 చెరువుల కింద 20 లక్షల ఎకరాలుసాగు కావాల్సి ఉండగా, అందులో సగానికి కూడా ప్రస్తుతం నీరందడం లేదని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకవచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇంజినీర్లకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ఉండాలని, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

మన ఊరు- మన చెరువు కార్యక్రమం: మంత్రి టీ హరీశ్‌రావు
తెలంగాణలో అర్బన్ నియోజకవర్గాలు మినహా ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ప్రభుత్వం ప్రాధాన్యతలను ఆయన మీడియాకు వెల్లడించారు. రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హరీశ్‌రావు చెప్పారు. కొత్తగా మరిన్ని ప్రాంతాలకు సాగునీటి వసతిని కల్పించాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. అదిలాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధులపై వివరాలను అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో మన ఊరు- మన చెరువు కార్యక్రమాన్ని చేపట్టి చెరువుల అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పాలమూరు ఎత్తిపోతల, జురాల- పాకాల ప్రాజెక్టులను రెండు, మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు.

ముంపు మండలాల విలీనం రాజ్యాంగ విరుద్దం: పోలవరం ముంపు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం రాజ్యాంగవిరుద్ధ్దమని హరీశ్‌రావు అన్నారు. విలీనానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్న సమయంలో సభ్యులు తప్పక సభలో ఉండాలని బీజేపీ, టీడీపీ పార్టీలు విప్‌లు జారీచేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు, బీజేపీ నేతలు ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. రైల్వే, సాధారణ బడ్జెట్‌లో కేటాయింపుల విషయంలోనూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మంత్రి అన్నారు.

సోమవారం ఢిల్లీకి మంత్రి హరీశ్: సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రప్రభుత్వానికి నివేదికను అందించడానికి రాష్ట్ర బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావుతోపాటు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవిందరెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితోపాటు కేంద్ర జలసంఘం అధికారులను కలవనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ తమ రాష్ర్టానికి తాజాగా కృష్ణా నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఒక లేఖ రాసింది. కృష్ణా బేసిన్ ప్రకారం తమకు నీటి వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

జస్టిస్ బ్రిజేష్ నేతృత్వంలోని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తాజాగా కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. బేసిన్ నిష్పత్తిలో నీటి కేటాయింపుల్లోనూ ,కరువుపీడిత ప్రాంతాల కోటాలోనూ తమ రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగిందని దానిని బ్రిజేష్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ నివేదిక సిద్ధం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా జలదోపిడీకి గురైందో వివరించనుంది. జూన్ 2 నుంచి కొత్తగా ఏర్పడిన తమ రాష్ర్టాన్ని రైపేరియన్ స్టేట్‌గా చేర్చి తాజాగా కేటాయింపులు చేయాలని స్పష్టం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పై వివక్ష చూపి ట్రిబ్యునల్ ముందు సరిగ్గా వాదించకపోవడం వల్ల తమకు ఎంత అన్యాయం జరిగిందనే విషయంపై సర్కార్ నివేదిక సిద్ధం చేసింది. తెలంగాణను రైపేరియన్ స్టేట్‌గా గుర్తించి కృష్ణా బేసిన్ ప్రకారం తాజాగా కేటాయింపులు ఎంత చేయాలనే విషయంపై ప్రభుత్వం కేంద్రజలసంఘానికి సమగ్ర నివేదికను సమర్పించనుంది.