పేదలందరికీ నాణ్యమైన జీవితం

-అదే సర్కార్ లక్ష్యం
-క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్

KTR in Quality control forum for india meeting

పేదలందరికీ మెరుగైన, నాణ్యమైన జీవనాన్ని అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మ్యారీగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా 28వ వార్షికోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆ క్రమంలోనే ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక మన పట్టణం -మన ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా ప్రజల స్థితిగతులను తెలుసుకొని ప్రభుత్వం అందుకు తగినట్లుగా ప్రణాళికలు అమలు చేయనుందని వివరించారు. రాబోయే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

రాష్ట్ర విద్యార్థులు పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు పరిశ్రమలను, ఇంజినీరింగ్ కళాశాలలను అనుసంధానం చేస్తూ టీ హబ్ ఏర్పాటుతోపాటు, టాస్క్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఫోరం కార్యక్రమాల నిర్వాహణకు స్థలం కేటాయించే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వస్తూత్పత్తిలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్న వివిధ కంపెనీల ప్రతినిధులకు మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్యాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా చైర్మన్ సీహెచ్ బాలకృష్ణారావు, ఏ శ్వాంమోహన్, డీ కే శ్రీవాత్సవ, మనోహర్ హెగ్డే, విశాల్‌కరణ్, బీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.