పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం

-దవాఖాన భవనానికి రూ.4. 5కోట్లు
-పేట పట్టణ సంపూర్ణ అభివృద్ధికి కృషి
-నియోజకవర్గంలో రెండు మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం
-అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
– రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు
-భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

Harish Rao

పెంటావాలంట్ టీకాతో శిశుమరణాలను అరికడతామని, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సదాశివపేట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సిద్దాపూర్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుడూ పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూ. 4కోట్ల 50లక్షలతో 50 పడకల దవాఖాన భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశామన్నారు. ప్రస్తుతం పాత భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు పూర్తి స్థాయిలో వైద్యం పొందలేక పోతున్నారన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే రూ. 4కోట్ల 50 లక్షలను మంజూరు చేశారన్నారు. శిశు మరణాలు అరికట్టేందుకు పెంటా వాలెంట్ టీకా ప్రారంభిస్తున్నామన్నారు.

ఈ టీకా ద్వారా ఐదు రకాల రోగాలను నివారించవచ్చన్నారు. చిన్న పిల్లలకు తప్పని సరిగా ఈ రోగ నిరోధక టీకాను వేయించాలని సూచించారు. పెంటా వాలెంట్ వ్యాక్సిన్‌లు దేశ వ్యాప్తంగా 8 రాష్ర్టాల్లోనే అమలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే విగ్ వ్యాధితో 72 మంది చనిపోయినట్టు తేలిందన్నారు. అలాంటి వ్యాధులను అరికట్టడానికే పెంటా వాలెంట్ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ సంపూర్ణంగా కృషి చేస్తున్నారని, వాటర్ గ్రిడ్ నీరు అందించేందుకు సింగూరు నుంచి బుధేరా వరకు పైప్‌లైన్ పనులు వేసి బుధేరా గుట్టపై ట్యాంక్ నిర్మాణం చేపడుతామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 5లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.