పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు

-ఇందిరాగాంధీపురం వాసులకు సీఎం కేసీఆర్ హామీ

CM KCR visited indira gandi nagar slum areas

ఫతేనగర్ పరిధిలోని ఇందిరాగాంధీపురం వాసులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జీ+2 పద్ధతిలో ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి వెళ్తూ ఇందిరాగాంధీపురం బస్తీని ఆయన సందర్శించారు. స్థానికులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస వసతులు కూడా లేకుండా దుర్బర జీవితాలు గడుపుతున్న అక్కడి పేదలను చూసి చలించిన సీఎం, వెంటనే డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రంలోగా నివేదిక తయారుచేసి తనకు అందజేయాలని సూచించారు. దాంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెంటనే కూకట్‌పల్లి సర్కిల్ ఉప కమిషనర్ గంగాధర్‌రెడ్డికి ఇందిరానగర్ సర్వే పనులను అప్పగించారు. గంగాధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సహాయ సిటీ ప్లానర్, టీపీఎస్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు బస్తీలోని ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఇందిరాగాంధీపురం ఆర్‌యూబీ సమీపంలో నివాసముంటున్న 25 కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించినట్లు డీసీ గంగాధర్‌రెడ్డి తెలిపారు.

ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ రాలేదు
ఇక్కడ మేం ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్నాం. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ ఇక్కడికి రాలేదు. సీఎం కేసీఆర్ మా ఇండ్ల దగ్గరికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. గుడికి వెళ్తున్న సీఎం సాబ్ మా ఇండ్లను చూసేందుకు వచ్చినందుకు నమస్తే చెబుతున్నం. మా జాగల మాకే ఇండ్లు కట్టిస్తే కేసీఆర్ సాబ్‌కు రుణపడి ఉంటం.
– ఎండీ గౌస్, స్థానికుడు

కేసీఆర్ సాబ్‌కు అల్లా అచ్ఛాకరేగా
గరీబోళ్లకు మంచిగా జేస్తున్న కేసీఆర్ సాబ్‌కు అల్లా అచ్ఛాకరేగా. పండుగలకు ఇంతకు ముందు ఎవరు ఆదుకోలేదు. రంజాన్ పండుగకు గరీబోళ్లకు బట్టలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ మాకు ఇండ్లు కట్టిస్తే కేసీఆర్ సాబ్‌కు అల్లా దువాకరేగా. గ్రేటర్ ఎన్నికలలో సాబ్‌కే మా మద్దతు.
– బదర్‌బేగం, స్థానికురాలు