పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కన్నీళ్ల నుంచి వచ్చింది.. వారి సంక్షేమానికి కట్టుబడి ఏడాదిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణితో కలసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడిరాష్ట్రంలో రోడ్లు నిర్మించుకునేందుకు రూ.లక్ష కూడా మంజూరయ్యేది కాదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాది లోనే రూ.15వేల కోట్లతో రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెస్తున్నామని, 36 శాతం ఉన్న ట్యాక్స్ రెవెన్యూను 76 శాతానికి పెంచుతామన్నారు.

Panchayat Minsiter KTR laid foundation stone for watergrid porject in Medak constituency

-రూ.15 వేల కోట్లతో రోడ్లు ..సంక్షేమానికి రూ.27 వేల కోట్లు
-రూ.నాలుగు వేల కోట్లతో 37 లక్షల మందికి పింఛన్లు
-మార్చి నుంచి రైతులకు 9 గంటల విద్యుత్: మంత్రి కేటీఆర్
సమైక్యపాలనలో రూ.800 కోట్లతో 29 లక్షల పింఛన్లు ఉంటే, ఆసరా కింద ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో 37 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నదని వివరించారు. సంక్షేమరంగానికి ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్‌లో రూ.27వేల కోట్లకు పెంచామని చెప్పారు. గతంలో సమైక్యపాలనలో రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించేవారని గుర్తుచేశారు. మార్చి నుంచి రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూటే సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. ఏడాదిలోగా రూ.91వేల కోట్లతో 24వేల మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతామన్నారు.