పేదల కలలు నిజం చేద్దాం

-కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి
-టీఆర్‌ఎస్ బహిరంగసభలో ఎంపీ కేశవరావు
-అమరుల ఆశయాలు సాధిద్దాం: పల్లా
-వెనుకబడిన వర్గాల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం: మహమూద్ అలీ

Keshava Rao 01

రాష్ట్రంలో పేదల కలలు నిజం చేసుకొనే సమయం ఆసన్నమైందని, ఆ కలలు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో నిజమవుతున్నాయని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను సీఎం కేసీఆర్ పునర్నిర్మించి పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని కేశవరావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేవలం 10 నెలల పాలనాకాలంలోనే కరెంటు కోతలు లేకుండాచేయడం అనితరసాధ్యమన్నారు. ఎండాకాలంలో కూడా కరెంటు కష్టాలు రాకుండా చేయడం కేసీఆర్ ఘనతేనన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాగతోపన్యాసం చేశారు. ఉద్యమ కమాండర్ సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు వచ్చిన అశేష జనవాహినికి, తెలంగాణ మట్టికి, పోరుబిడ్డలకు దండం అంటూ అభివాదం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కడగండ్లను తీరుస్తుందన్నారు.
తెలంగాణ అమరులు ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ, సుద్దాల హన్మంతు, సమ్మక్క సారలమ్మ, ఐరేని మల్లమ్మ, వేములవాడ భీమన్న ఆశయాల సాధన కోసం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణ కోసం పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్నాయని అన్నారు. వెనుకబడివర్గాలను అభివృద్ధి చేసేందుకు ముస్లిం మైనార్టీ, దళిత వర్గాల వ్యక్తులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారని కొనియాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, ఆసరా, రేషన్ బియ్యాన్ని ఒక్కొక్కరికి ఆరు కిలోలకు పెంచడం తదితర పథకాల గురించి రాజస్థాన్‌లో కొందరు తమను అడిగారని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు మైనార్టీలు అండగా ఉండాలని కోరారు.