పేద సిక్కు యువతులకూ కల్యాణలక్ష్మి

– ప్రభుత్వ సెలవుదినంగా గురునానక్ జయంతి
– అతిపెద్ద గురుద్వారా నిర్మాణానికి మూడెకరాల స్థలం
– గురునానక్ జయంతి వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

KCR offered Prayers in Gurudwar01

గురునానక్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిక్కు సోదరులపై వరాల జల్లు కురిపించారు. నిరుపేద సిక్కు కుటుంబాల్లోని అమ్మాయిల వివాహాలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు. గురునానక్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తామని, దక్షిణాదిలోనే అతిపెద్ద గురుద్వారా నిర్మాణానికి మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గురునానక్ జయంతి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం నిర్వహించిన విశాల్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు.

పెద్ద గురుద్వారా మనదగ్గరే ఉండాలి…

ఉత్తరాదిలో పెద్ద పెద్ద గురుద్వారాలు అనేకం ఉన్నా దక్షిణాది రాష్ర్టాల్లో అంతగా లేవని కేసీఆర్ అన్నారు. ఆ లోటును తెలంగాణ ప్రభుత్వం తీరుస్తుందని హామీనిచ్చారు. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద గురుద్వారా హైదరాబాద్‌లో నిర్మించాలని అన్నారు. దానికోసం ప్రభుత్వం నగరంలో మూడెకరాల స్థలం ఇస్తుందని ప్రకటించారు. గురుద్వార కమిటీ ఆ నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గురుద్వారా నిర్మాణానికి తన కుటుంబం తరపున లక్షా పదహారు వేల రూపాయల చెక్కును గురునానక్ ప్రబందక్ కమిటీకి అందజేశారు. కోటి రూపాయల ఖర్చుతో సిక్కులకు ఒక సామాజిక భవనం కూడా నిర్మిస్తామన్నారు. సిక్కు సోదరులలో ఎంతో మంది పేద, బలహీన వర్గాల వారు ఉన్నారని, అలాంటి వారి అమ్మాయిల వివాహాల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు.

ఆత్మవిశ్వాసంలో సాటిలేదు..
సిక్కుల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని, జీవితం ఎంతో ఆదర్శంగా ఉంటుందని కేసీఆర్ ప్రశంసించారు. సిక్కులు కష్టపడి పని చేసే తత్వం ఉన్న వారు.. ప్రపంచంలో ఎక్కడా సిక్కులు భిక్షాటన చేస్తూ కనిపించరని ఆయన వివరించారు. కష్టించే తత్వమే వారిని ఆత్మగౌరవంతో ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు. గురునానక్ కుల మత రహిత సమాజ నిర్మాణం కోసం కషి చేశారని వివరించారు. ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకమన్నారు.

మత సామరస్యం, మానవత్వానికి ప్రతీకలన్నారు. అంతకు ముందు గురుద్వారా ప్రబంధక్ కమిటీ కార్యదర్శి ఇంద్రజిత్ సింగ్ మాట్లాడుతూ గురునానక్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి అత్యంత పవిత్రమైన గురునానక్ జయంతిని వచ్చే ఏడాది నుంచి సెలవు దినంగా ప్రకటిస్తామని, వెంటనే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌలిగూడా గురుద్వార ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు కుల్‌దీప్‌సింగ్ బగ్గా, కార్యదర్శి ఇంద్రజిత్‌సింగ్, సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్ అధ్యక్షుడు బల్ దేవ్‌సింగ్ బగ్గా, కార్యదర్శి అవతార్‌సింగ్, మీడియా కార్యదర్శి బచన్ జిత్‌సింగ్, గోషామహల్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ ప్రేమ్‌కుమార్ ధూత్ పాల్గొన్నారు.