పెద్ద మనసు చాటుకున్న కేసీఆర్

– అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి ముత్యంరెడ్డికి అండ
– అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు ఏర్పాట్లు

KCR 09

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. రాజకీయాలు స్నేహబంధాలకు అడ్డుకావని నిరూపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి ఆపతిసమయంలో అండగా నిలిచారు. అనారోగ్యంతో ఉన్న తనకు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేల కోటాలోఅందుతున్న మెడికల్ బిల్లుల డబ్బు సరిపోవడం లేదని, ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ ముత్యంరెడ్డి గురువారం సచివాలయంలో సీఎంను కలిశారు. కొద్దిరోజుల కిందట కుడివైపు కింది దవడభాగంలో క్యాన్సర్ సోకడంతో ఆయన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటున్నారు.

ఇటీవల గుండెపోటుకు సంబంధించిన చికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత పంటి సమస్య తలెత్తడంతో పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం కీమోథెరపీ కొనసాగుతున్నది. ఈ చికిత్స కోసం విపరీతమైన డబ్బు ఖర్చు అవుతున్నదని, వైద్య ఖర్చుల కింద అందించే మొత్తాన్ని మరింత పెంచాలని ఆయన సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో చలించిపోయిన సీఎం కేసీఆర్ అమెరికా వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. తనకు అంత స్తోమత లేదని ముత్యంరెడ్డి చెప్పడంతో.. ఆయన స్థితికి సీఎం ఆవేదన చెందారు. డబ్బు విషయం తనకు వదిలి, ముందు ఆరోగ్యం కాపాడుకోండని సూచించారు. వెంటనే సీఎంవో అధికారులను పిలిపించి, ప్రపంచంలోనే మెరుగైన వైద్యం అందే అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ దవాఖానకు ముత్యంరెడ్డిని పంపాలని ఆదేశించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాస్‌పోర్టు, వీసాలతోపాటు అక్కడ వైద్యుల అపాయింట్‌మెంట్ తదితర వ్యవహారాలను కూడా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆత్మీయ స్పందన చూసి ముత్యంరెడ్డి కండ్లు చమర్చాయి. ఆర్తీతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం ఉదార హృదయంతో స్పందించారు: ముత్యంరెడ్డి
కేసీఆర్ ఎంతో ఉదార హృదయంతో స్పందించారు. నాకు సోకిన వ్యాధికి వైద్యం చేయించుకునేందుకు తగినన్ని డబ్బులు లేని పరిస్థితుల్లో వైద్యఖర్చుల మొత్తాన్ని పెంచాలని కోరేందుకు సీఎంను కలిశాను. నా పరిస్థితి చూసి చలించిపోయి.. అమెరికాలో చికిత్సకు ఏర్పాట్లు చేసిన సీఎంకు సదా కృతజ్ఞుడిని అని ముత్యంరెడ్డి అన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం మరోసారి సచివాలయానికి వెళ్ళనున్నట్లు ముత్యంరెడ్డి తెలిపారు.