పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యం

పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా 840 గురుకులాలను ఏర్పాటు చేసుకోగలిగామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వాలు పాఠశాలలు, కళాశాలలకు నిధులివ్వకుండా, నియామకాలు చేపట్టకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాయన్నారు. గురువారం మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

హరితహారంలో భాగంగా భూత్పూరు మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో మొక్కలునాటి శేరిపల్లి క్రషర్ దగ్గర సీడ్‌బాల్స్ విసిరారు. పాలమూరులో వర్షాలు ఎక్కువగా కురువాలంటే ప్రతిఒక్కరూ హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మక్తల్ మార్కెట్‌లో మొక్కలు నాటి మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూరులో, జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలు ప్రారంభించారు. అనంతరం కడియం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మూడేండ్లలోనే విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలంగాణలో మొత్తం 404 జూనియర్ కాలేజీలు ఉంటే వీటిలో 390 కాలేజీలకు పక్కా భవనాలున్నాయని, మిగిలిన 14 కళాశాలలకు స్థలాలు కేటాయించిన వెంటనే కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే తెలంగాణ ప్రభుత్వం భవనాల కోసం రూ.320 కోట్లను ఖర్చు చేసిందన్నారు.

వీటితోపాటు ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్సు ల్యాబొరేటరీలు, ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు, నిరంతరం నీటి వసతిని కల్పిస్తున్నామని చెప్పారు. మరో రెండేండ్ల తరువాత ప్రైవేట్ స్కూళ్ల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వస్తారన్నారు. 2016 ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టామన్నారు. అంబేద్కర్ ఆశయసాధన జరుగాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మెరుగైన విద్య అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని, ఆ దిశగా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నా రని చెప్పారు. తాను 100 గురుకులాలను మం జూరు చేయాలని అడిగితే ఏకంగా 525 గురుకులాలను మంజూరు చేసి పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేశారన్నారు. మహబూబ్‌నగర్‌లో గత 70 ఏండ్లలో 99 గురుకులు మంజూరైతే కేవలం 3 ఏండ్లలో 81గురుకులాలు తీసుకువచ్చామన్నారు. రాష్టానికి మంజూరైన 84 కేజీబీవీల్లో 17 మహబూబ్‌నగర్‌లో ఉన్నాయన్నారు. నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేల వినతి మేరకు పీజీ సెంటర్‌ను, సైనిక పాఠశాలను, గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ అక్షరాస్యతలో వెనుకబడిన పాలమూరు జిల్లాకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని మంత్రి కడియం శ్రీహరిని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, విద్యాశాఖ మౌలిక వసతులు కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తదితరులు పాల్గొన్నారు.