పావలా ప్రజలకు.. ముప్పావలా జేబులోకి

కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ –
సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, నూటికి నూరు శాతం తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో కేసీఆర్ మాటలు… ‘టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను వంద శాతం అమలు చేసి తీరుతాం. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టింది. కాంగ్రెస్‌కు దూర దష్టి లేదు.. ప్రజల్లో నవ్వులపాలవడం ఖాయం. కాంగ్రెస్ నీతి ప్రకారం పావలా ప్రజలకు.. ముప్పావలా జేబులకు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోను అమలు చేస్తాం.

kcr2

జైరాం పిచ్చికూతలు మానాలి : కేసీఆర్
తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం చేసింది జైరాం రమేషే. ఇప్పటికైనా జైరాం పిచ్చికూతలు మానుకోవాలి. జైరాం రమేష్ జీవితంలో సర్పంచ్‌గా కూడా గెలవలే. పొన్నాల లక్ష్మయ్య టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాపీ కొట్టిండు. కేసీఆర్‌ను తిట్టడమే టీ కాంగ్రెస్ నేతల ప్రచారమైంది. పొన్నాల లాంటి నేతలకు స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం లేదు. ప్రజలకు మేం అరచేతిలో వైకుంఠం చూపించలేం. బీసీలకు 30 టికెట్లు ఇచ్చినం. 55 శాతం బడుగు, బలహీన వర్గాలకు సీట్లు కేటాయించాం.

టికెట్ దక్కని వాళ్లు బాధ పెట్టుకోవద్దు : కేసీఆర్
ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు దక్కని వారు బాధ పెట్టుకోవద్దు. మోలుగురి భిక్షపతి, బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వారు బాధ పెట్టుకోవద్దు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ స్థానాలిచ్చి గౌరవిస్తాం. పార్టీకి సేవ చేసిన వారికే సీట్లు కేటాయించినం. అవకాశం రాకున్నా నా మాటకు గౌరవం ఇచ్చిన వారికి న్యాయం చేస్తాం. ఉద్యమంలో పని చేసి టికెట్ రాని వారిపై సానుభూతి ఉందని’ చెబుతూ కేసీఆర్ మీడియా సమావేశాన్ని ముగించారు.