పటిష్టంగా పార్టీ నిర్మాణం!

-గ్రామాల నుంచి రాష్ట్రస్థాయి దాకా కమిటీలు
-సంక్రాంతి తర్వాత భారీ ఎత్తున టీఆర్‌ఎస్ ప్లీనరీ
-పార్లమెంటు సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆశీర్వాదంతో పాలనా పగ్గాలు చేపట్టి బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా సాగిపోతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయటంపై దృష్టి సారించారు. తెలంగాణ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయటంతో బిజీగా ఉండి పార్టీపై కొంతకాలంగా దృష్టి పెట్టలేకపోయిన ఆయన, కొత్త సంవత్సరంలో గులాబీ పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టంగా నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. 2015 ఆరంభంలోనే పార్టీకి సంబంధించిన కీలక ప్రక్రియలను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక రెండు, మూడు దఫాలుగా పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారే తప్ప పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టిసారించలేదు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే భారీ ఎత్తున టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమైనప్పటికీ మెట్రోపొలిస్ సదస్సు, హుదూద్ తుఫాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ప్లీనరీ ఏర్పాటు, పార్టీ వ్యవస్థాగత నిర్మాణానికి అధినేత నుంచి సంకేతాలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

క్షేత్రస్థాయి నుంచి కమిటీలు..
పార్టీని కమిటీలతో మరింత పటిష్టం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీలో ఆదివారం టీఆర్‌ఎస్ ఎంపీలకు తెలిపినట్లు సమాచారం. పార్టీ ప్లీనరీని జనవరిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన ఎంపీలతో అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత భారీ ఎత్తున హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. ప్లీనరీలో పార్టీ నిర్మాణంపై పార్టీ శ్రేణులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేయనున్నట్లు ఎంపీలకు ముఖ్యమంత్రి చెప్పారు.

మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో నూతన కమిటీలు వేసి పార్టీ నిర్మాణాన్ని మరింత పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోనే భారీ బహిరంగసభ ఏర్పాటుచేసే అవకాశం కూడా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఎంపీలతో చర్చలో మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే కచ్చితంగా విస్తరణ ఉంటుందిగానీ.. అదెప్పుడనే దాని పై మాత్రం సీఎం స్పష్టత ఇవ్వనట్లు తెలిసింది. పార్టీ వర్గాలు మాత్రం సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతుండగా ఆలోపు కూడా ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.