పార్టీలకతీతంగా ప్రాంతాల అభివృద్ధి..

పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనుక్షణం పేదల బాగుకోసమే ఆలోచిస్తున్నారన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని, ఈ క్రమంలోనే ప్రజలు టీఆర్‌ఎస్‌ను తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని మెదక్, వరంగల్ ఉప ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించారన్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురంలో మంత్రి హరీశ్‌రావు రూ.137 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పటాన్‌చెరులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరులో ఒకే రోజు రూ.137 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకున్న సందర్భం మునుపెన్నడూ చూడలేదన్నారు.

Harish-Rao-laid-foundation-stone-for-development-works

-సీఎం కేసీఆర్ ఆలోచనంతా పేదల బాగుకోసమే
-టీఆర్‌ఎస్ ప్రజల ఇంటి పార్టీ
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
-పటాన్‌చెరు నియోజకవర్గంలో రూ.137 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గత ప్రభుత్వాలు కాలుష్యనగరంగా మార్చిన పటాన్‌చెరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రూ.కోట్ల విలువ చేసే టీఐఐసీకి సంబంధించిన 15 ఎకరాల భూమిని ఒక్క పైసా చెల్లించకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ మార్కెట్ కమిటీకి కేటాయించారన్నారు. తెలంగాణలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పటాన్‌చెరులో నిర్మాణం కాబోతున్నదని, ఇందులో రైతుబజార్, గ్రేయిన్, ఉల్లి, కూరగాయాలు, పండ్లు ఒకే చోట లభిస్తాయన్నారు. మార్కెట్ యార్డు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరడంతోపాటు రోడ్డుపై మార్కెట్ తొలగిపోయి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానున్నదన్నారు. పటాన్‌చెరు, ఆర్సీపురంలలో సాకి, రాయసముద్రం, తిమ్మకచెరువులను రూ.8.56 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు. పటాన్‌చెరుతోపాటు ఆర్సీపురం వద్ద మల్టిలెవల్ ైప్లె ఓవర్లు రానున్నాయని, వాటితో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నారు.

గతంలో కనీసం ఇక్కడ జీహెచ్‌ఎంసీ కార్యాలయం లేదని, స్వరాష్ట్రంలో రూ.2 కోట్లతో కార్యాలయ నిర్మాణం చేపట్టామన్నారు. రూ.4 కోట్లతో , ఆర్సీపురంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు నిర్మాణం కాబోతున్నాయని పేద, బలహీన వర్గాలకు ఎంతో ఊపయోగపడనున్నాయన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కృషితో టోల్ భారం కూడా తగ్గిందని, త్వరలోనే పటాన్‌చెరులో రూ.50 కోట్లతో ఆరులైన్ల రోడ్డు నిర్మాణం కానున్నదని వెల్లడించారు. జీవో 58 ద్వారా ఒక్క పటాన్‌చెరు, ఆర్సీపురంలోనే ఐదు వేల మంది పేదలు ఉచితంగా ఇంటిపట్టాలు తీసుకుని సొంతింటి వారయన్నారని సంతోషం వ్యక్తంచేశారు. తీవ్ర కరువులో కూడా తాగునీరందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్సీపురం గెస్ట్‌హౌస్ వద్ద రూ.60 కోట్లతో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి, పటాన్‌చెరులో రూ.70 కోట్లతో పైప్‌లైన్, రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.