పార్లమెంట్‌లో పోలరణం

-పోలవరం డిజైన్ మార్చి ఎత్తు తగ్గించండి: కవిత
-ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో కేకే, పాల్వాయి, రాపోలు అభ్యంతరం

KK and Kalvakuntla Kavitha

పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో మంగళవారమూ నిరసన వ్యక్తమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో కవిత,రాజ్యసభలో కేకే తమ వాదనలను వినిపించారు. ఇటీవలే ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు, పేరును మార్చాలన్నా ఆర్టికల్-3 ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ఆర్డినెన్స్ ద్వారా సాధ్యం కాదని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మార్చి 1వ తేదీన గెజిట్ విడుదల కావడంతో కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ ఆర్డినెన్సు తీసుకురావడం, రాష్ట్ర సరిహద్దులను మార్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, దీని డిజైన్‌ను మార్చడంతో పాటు ఎత్తును కూడా తగ్గించాలని ఆమె కోరారు. డిజైన్‌ను మార్చకుండా పోలవరం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతాయని, వారి జీవనాధారం దెబ్బతింటుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని కోరారు.

డిజైన్‌ను మార్చడం ద్వారా ముంపు ప్రభావాన్ని తగ్గించవచ్చునని అన్నారు. ఈ పోలవరంపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని, ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిందని ఆమె అన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌రాష్ర్టాల్లోని గిరిజనులకు నష్టం జరుగుతోందని, నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను సమావేశపర్చి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. ఇక రాజ్యసభలోనూ టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు పోలవరం ఆర్డినెన్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఉదయం కార్యకలాపాలు ప్రారంభంకాగానే హిమాచల్‌ప్రదేశ్ విషాదంపై రెండు నిమిషాల మౌనం పాటించారు.

అనంతరం ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్యపై మాయావతి చర్చను లేవనెత్తారు. రాంగోపాల్ యాదవ్, సతీష్‌చంద్ర మిశ్రా తదితరులంతా ఈ చర్చలో జోక్యం చేసుకున్నారు. దీంతో సభను చైర్మన్ పది నిమిషాలు వాయిదావేశారు. అనంతరం సభ పునఃప్రారంభం కాగానే మళ్లీ ఉత్తరప్రదేశ్ అంశం చర్చకు రావడంతో చైర్మన్ జోక్యం చేసుకుని, ఆర్టికల్ 356 కింద కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాల్సిందిగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును కోరారు. ఇంతలో టీఆర్‌ఎస్ ఎంపీ కేకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని, మంత్రి మరికొన్ని అంశాలను సభా దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఇవ్వాలని కేకేను చైర్మన్ కోరారు. కేశవరావు మళ్లీ తన పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ లేవడంతో చైర్మన్ దాన్ని వినిపించడానికి అవకాశం ఇచ్చారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం ఏవేని అంశాలు సభలో ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఒకేసారి రాజ్యసభ, లోక్‌సభలో ప్రవేశపెట్టాలని, కానీ రాజ్యసభను తక్కువ చేసి చూసే విధానం మంచిది కాదని, ఈ విషయంలో చైర్మన్‌గా చొరవ తీసుకోవాలని కోరారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన పన్నెండుగంటల తర్వాత రాజ్యసభలో ఈ పేపర్లు ప్రవేశపెడుతున్నారని, సభా మర్యాదను, గౌరవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, గతంలో ఒకేసారి ప్రవేశపెట్టే సంప్రదాయం ఉందని వివరించారు. ఇంతలో మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన సవరణల ఆర్డినెన్సును సభలో ప్రవేశపెట్టారు. వెంటనే ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి లేచి తెలంగాణకు చెందిన ఖమ్మంజిల్లాలోని ఏడు మండలాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌లో చేరుతున్నాయని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రభుత్వం అనుమతి లేకుండా ఆర్డినెన్సు ద్వారా ఆ రాష్ర్టానికి చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అన్యాయమన్నారు. ఇంతలో కేశవరావు కూడా లేచి ఆర్డినెన్సులో చాలా తప్పులు ఉన్నాయని, అసంబద్దమైనదని వ్యాఖ్యానించారు.

ఇది చాలా సీరియస్ అంశమని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై ఎవరి వాదనలు వారు వినిపించుకునే అవకాశమివ్వాలని రాపోలు ఆనంద్‌భాస్కర్ కోరారు. టీడీపీ ఎంపీ సుజనాచౌదరి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నం చేయగా చైర్మన్ అన్సారీ అడ్డుకున్నారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం జోక్యం చేసుకుని ఇది సమసిపోయిన అంశమనీ, మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదన్నారు. చర్చకు పదేపదే ఏపీ ఎంపీలు అభ్యంతరం కలిగించడంతో చర్చించడానికి ఇంకా సమయం ఉందంటూ అన్సారీ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాల్సిందిగా కోరారు.