పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి ఆర్డినెన్సు

-వరంగల్‌లో కాళోజీ హెల్త్ వర్సిటీకి క్యాబినెట్ అంగీకారం
-క్రైస్తవ భవన్ నిర్మాణానికి ఆమోదం
-జనవరి 1న సెలవుకు ఓకే

KCR
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై నిర్ణయం తీసుకుంది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశానికి తాజా విస్తరణలో చోటుదక్కిన తుమ్మల మినహా మిగిలినవారు అందరూ హాజరయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో దేశ తొలి ప్రధాని నెహ్రూ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పార్లమెంటరీ సెక్రటరీల విధానాన్ని సీఎం కేసీఆర్ మరోసారి తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
భవిష్యత్ తరాలను, రాజకీయ నాయకత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని సీఎం నిర్ణయించి, ప్రకటించారుకూడా. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంలో గతంలో కొన్ని రాష్ర్టాల్లో చట్టపరమైన చిక్కులు ఎదురైనట్టు సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. ఈ చిక్కులు ఉండకుండా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. వరంగల్‌లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కుకూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రెండు రోజుల క్రితం సీఎం ప్రకటించినట్టుగా రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవన్‌ను నిర్మించాలనే నిర్ణయంతోపాటు జనవరి ఒకటి సెలవుదినానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి ఒకటిన సెలవుకు బదులుగా ఫిబ్రవరి నెల రెండో శనివారం పనిదినంగా నిర్ణయించారు. ఈ మేరకు రాత్రి జీవో జారీ అయింది. పార్లమెంటరీ కార్యదర్శుల ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేశారు.