పరిశ్రమలకు ల్యాండ్ బ్యాంక్

-సింగిల్ విండో పారిశ్రామిక పాలసీ
-మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
-అదానీ గ్రూప్ సంస్థల బృందంతో సీఎం కేసీఆర్

KCR-0002
పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే విధంగా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. పరిశ్రమలకు ఒక్క సమావేశంతోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేసే సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీ కలిశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలను నెలకొల్పేందుకు అవసరమైన భూములు గుర్తించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. దీనిపై క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో నలుమూలలా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని రంగాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. పరిశ్రమలకు భూములు కేటాయించి చేతులు దులిపేసుకునే విధానానికి తాము వ్యతిరేకమన్నారు. ముందుగానే నీళ్లు, రవాణా, రోడ్డు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నిర్దేశిత భూముల్లో మౌలిక వసతుల కల్పన పూర్తయ్యాకే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి అదానీ గ్రూప్ వంటి సంస్థలు మంచి పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీ మాట్లాడుతూ తమ సంస్థ 2020లోగా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నదని చెప్పారు. అలా ఉత్పత్తి చేసిన విద్యుత్ అవసరం ఉన్న రాష్ర్టాలకు సరఫరా చేస్తామన్నారు. తెలంగాణలోనూ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.