పరిశ్రమలకు ఆధార్ తరహా కోడ్

అవినీతికి తావు లేదు.. సమయం వృధాకు అవకాశం ఇవ్వం. పూర్తి పారదర్శకతే తెలంగాణ ప్రభుత్వ విధానం. పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. వాటిని పొందేందుకు కూడా మరింత వెసులుబాటు కల్పిస్తున్నాం. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. వారికి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఖాతాలోకి వచ్చేట్లు ఏర్పాటు చేస్తున్నాం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సోమవారం పరిశ్రమల శాఖ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

Jupally-Krishna-Rao

-సబ్సిడీలకు మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చు
-రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల స్థాపనకు విశేష స్పందన
-వెబ్‌సైట్‌లో సమగ్ర సమాచారం ఉంచుతాం
-విద్యుత్తు సమస్యను అధిగమిస్తాం
-రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
అనంతరం పరిశ్రమల భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయితీలు పొందేందుకు కూడా పరిశ్రమలన్నింటికీ ఆధార్ తరహా కోడ్(ఐడీ నెంబర్) ఇస్తామన్నారు. సెంట్రలైజ్డ్ మానిటరింగ్ ద్వారా రాయితీలను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే పారిశ్రామికవేత్తలు, ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను నాలుగైదు రోజుల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే సమగ్ర సమస్త సమాచారంతో త్వరలోనే వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు.

అత్యద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ-ప్రైడ్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత పరిశ్రమల స్థాపనకు అవసరమైన డీపీఆర్‌ను తయారు చేయించి ఇచ్చేందుకు రిటైర్డ్ తహశీల్దార్లను కూడా నియమించుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ మౌలిక సదుపాయాల కల్పనకు పాలకులు నిధులు కేటాయించిన పాపాన పోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమే రూ.100 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి కొనియాడారు. ఈ ఏడాది కూడా అదనంగా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సబ్సిడీల కింద ఇప్పటికే రూ.306 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారని, ఐతే కొందరు విద్యుత్ కొరత ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

అతి తక్కువ కాలంలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తామన్నారు. దానికి సీఎం కేసీఆర్ సమగ్ర కార్యాచరణను ప్రకటించారని, ఇప్పటికే అమలు జరుగుతుదన్నారు. ప్రధానమంత్రి ఉపాధి గ్యారంటీ ప్రోగ్రాం కింద ఇచ్చే రుణాల్లో లబ్ధిదారుల ఎంపిక సహేతుకంగా లేదన్నారు. దీన్ని మార్చాలని జనరల్ మేనేజర్లను కోరారు. పైరవీలకు తావు లేకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఇప్పటికే కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాం: ప్రదీప్‌చంద్ర
ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలు నెలకొల్పుతామంటూ భూములు పొందిన సంస్థలు దుర్వినియోగం చేస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర ప్రకటించారు. ఇప్పటికే సుల్తాన్‌పూర్‌లో సత్యం సంస్థకు చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందుటెక్, ఇంకా మరికొన్ని సంస్థల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.వెంకటనర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, జాయింట్ డైరెక్టర్ ఎస్ మల్లేశం, డిప్యూటీ డైరెక్టర్ ఎస్ సురేష్, టీఎస్‌ఐఐసీ చీఫ్ ఇంజినీర్ చెంచయ్య పాల్గొన్నారు.

తొలి ఐ పాస్ సర్టిఫికెట్ జారీ
తెలంగాణ ప్రభుత్వం టీఎస్-ఐ పాస్ ద్వారా మొదటి సర్టిఫికెట్‌ను సోమవారం జారీ చేసింది. హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ టొబాకో(వీఎస్టీ) కంపెనీ విస్తరణకు సంబంధించిన అనుమతులను ఇస్తూ ఒకే సంతకంతో సిద్ధం చేసిన పత్రాలను పరిశ్రమల భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్ రంజన్‌లు కంపెనీ యజమానికి అందజేశారు. ఆజామాబాద్‌లోని వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ(వీఎస్‌టీ).. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ముత్తిరెడ్డిపల్లి(ఆటో పార్కు)కు మార్చేందుకు సిద్ధమైంది. గతంలో దరఖాస్తు చేసుకోగా తిరస్కరించారు. రూ.80 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న వీఎస్టీ పరిశ్రమకు టీఎస్-ఐ పాస్ కింద దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే అనుమతులు ఇచ్చారు.

ట్రయల్ రన్‌గా చేపట్టిన స్కీం సక్సెస్ అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇదే విధానాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అమలు చేయనున్నారు. సర్టిఫికెట్ల మీద రాష్ట్ర స్థాయిలో మెగా ప్రాజెక్టులకు పరిశ్రమల శాఖ కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ సంతకం మాత్రమే ఉంటుంది. మిగిలిన డిపార్టుమెంట్లన్నీ వారి ఫీజుబిలిటీ, అనుమతులన్నీ పరిశ్రమల శాఖకు లిఖితపూర్వకంగా ఇస్తారు. పారిశ్రామికవేత్తలకు మాత్రం టీఎస్-ఐ పాస్ లోగోతో కూడిన సర్టిఫికెట్ ఇస్తారు.