పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం

-గవర్నర్ ప్రసంగం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టింది
-హామీలు, వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం
-పోలవరం ఆర్డినెన్స్‌పై కోర్టులోనూ కొట్లాడుతాం:మంత్రి ఈటెల

Etela Rajender

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగం నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, జోగు రామన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోతోపాటు, ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించకుండా ప్రతిపక్షాలు కుసంస్కారంతో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు.. తాము దేనిని వ్యతిరేకిస్తున్నాయో స్పష్టం చేయాలి.
మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నయా? లేక చెప్పినవన్నీ చేస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నాయా? పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంధ ఆంగ్ల విద్యను అమలుచేయడాన్ని వ్యతిరేకిస్తున్నారాయా? రాజకీయ అవినీతిలేని పాలన అందిస్తామన్నందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయో చెప్పాలి అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం జనాభా దామాషా ప్రకారం..టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.10వేలకోట్ల చొప్పున రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తామని ధైర్యంగా ప్రకటించిందని గుర్తుచేశారు. గ్రామీణ ఆరోగ్యకేంద్రాల బలోపేతానికి, ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉండడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయా? అని ప్రశ్నించారు. పోలవరంపై కాంగ్రెస్, టీడీపీ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఈటెల విమర్శించారు. పోలవరం ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ పోరాడిందని, కోర్టులోనూ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.