పారదర్శకంగా చెరువు పనులు

– పనుల ప్రగతి, నాణ్యతపై ఫిర్యాదుకు కాల్ సెంటర్
– టీడీపీ నాయకులవి చౌకబారు విమర్శలు
– నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
– పూడికను రైతులు పొలాల్లో వేసుకోవాలి: మంత్రి పోచారం

Harish Rao addressing in Mission kakatiya programme

చెరువులు గ్రామాలకు ఇలవేల్పులని, ప్రజలకు కల్పతరువులని, సాంసృతిక కేంద్రాలని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్‌లో జంగంకుంట, ఆరవెల్లిలో కృష్ణ సముద్రం చెరువు, లింగాపూర్‌లో పెద్ద చెరువు పూడిక తీత పనులకు ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి పనులు ప్రారంభించారు. అనంతరం లింగాపూర్ చెరువులో ఏర్పాటు చేసిన సభలో, విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. 60 ఏండ్ల సమైక్యాంధ్ర పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.

చెరువులే ప్రధాన ఆకర్శణగా ఉన్న తెలంగాణలో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. లొట్టపీసు చెట్లు, సర్కారు తుమ్మలతో పూడిక నిండి, తూములు, మత్తడులు శిథిలమయ్యి మేజర్ ఇరిగేషన్ కాస్తా మైనర్ ఇరిగేషన్‌గా మారి తెలంగాణ ఎడారిగా మారిందని, వలసలకు కారణమయిందన్నారు. మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయలా మారిందని టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇతర నాయకులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని దుయ్యబట్టారు. పనికి ఆహార పథకం బియ్యం మెక్కిన అలవాటు వారికున్నదని మండిపడ్డారు. చెరువుల పేరుమీద జేబులు నింపుకున్న అలవాటు గత ప్రభుత్వాలదన్నారు. చెరువుల పూడికతీత పనులను తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపైసా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంటు ద్వారానే ఖర్చు చేయాలని ఆదేశించిన విషయం మర్చిపోయారా అని గుర్తుచేశారు. పనుల ప్రగతిని, నాణ్యతను తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. నేడు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పోటీలు పడి చెరువు పూడికతీత పనులు ప్రారంభిస్తూ మిషన్ కాకతీయను మెచ్చుకుంటున్నారన్నారు. ఎల్ రమణ ఎమ్మెల్యేగా ఓడిపోయారన్న బాధతో, కొబ్బరికాయ కొట్టే అవకాశం లేదన్న భావనతో ఇలా మాట్లాడుతున్నారని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

వాటర్ గ్రిడ్ చేపడుతుంటే దానిపైనా అభాండాలు వేస్తున్నారు అని ఆగ్రహించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే తమ అడ్రస్ గల్లంతవుతుందన్న అక్కసుతో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కారణం వారేనని, నేడు అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ నాయకులు ప్రజల దృష్టిలో దోషులుగా మిగలక తప్పదని హెచ్చరించారు. ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. చెరువు పనుల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రభుత్వ పారదర్శతకు నిదర్శనమన్నారు.

చెరువులతోనే గ్రామాభివృద్ధి: మంత్రి పోచారం
చెరువులతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం బుడ్మి గ్రామ ఊర చెరువు, సంగోజీపేట్, హన్మాజీపేట్ ఊర చెరువు పనులను మంత్రి ప్రారంభించారు. ఆర్మూర్ మండలంలోని గూండ్ల చెరువు పనులను ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. చెరువు మట్టిని రైతులు పొలాల్లో వేసుకోవాలని మంత్రి సూచించారు. మెదక్ జిల్లా దుబ్బాక, చేగుంట మండలాల్లో చెరువు పనులను ప్రభుత్వ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేర్పల్లి పరిధిలోని తాళ్ల చెరువు పనులను ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలో పనులను టీఆర్‌ఎస్ నియోకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ ప్రారంభించారు. మమబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం శాగాపురంలోని పోతులవానికుంట, పెద్దదిన్నెలోని పెద్దచెరువులో అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పనులను ప్రారంభించారు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణకు, ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు శ్రద్ధ కనబరచడం హర్షణీయమన్నారు.