పారదర్శక ప్రభుత్వం

-సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
-విద్య, వైద్యం, విద్యుదుత్పత్తి, వ్యవసాయం, ఇరిగేషన్..
-ఇవీ తెలంగాణ సర్కార్ ప్రాధాన్యాంశాలు
-సూచనలు ఇవ్వనున్న అడ్వయిజరీ కమిటీ
-30మందితో మేధావులు, నిపుణులతో ఏర్పాటు
-ఘంటా చక్రపాణి నివాసంలో ఎడిటర్ల భేటీ

తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా ఒక కమిటీకి రూపకల్పన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. నిపుణులు, మేధావులు, ఎడిటర్లు, జర్నలిస్టులు, ఆర్థికవేత్తలతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు.. మొత్తం 30 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీనికి స్టేట్ అడ్వయిజరీ కమిటీ (ఎస్‌ఏసీ) అని పేరు పెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయ అవినీతి లేకుండా, పారదర్శక పాలన అందించడం, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించడమే ఈ కమిటీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

TRS Party Online 01-06-14ప్రొఫెసర్ ఘంటాచక్రపాణి నివాసంలో శనివారం ఎడిటర్లతో జరిగిన సమావేశంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, సాక్షి ఎడిటర్ వర్ధెళ్లి మురళి, సీనియర్ సంపాదకులు కే రామచంద్రమూర్తి, టంకశాల అశోక్, డక్కన్ క్రానికల్ పొలిటికల్ ఎడిటర్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతలు, పారదర్శక పాలన అనే అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు సాగినట్లు తెలిసింది. కేసీఆర్ బిజీషెడ్యూల్‌లో కూడా భవిష్యత్తు ప్రణాళికల విషయమై సంపాదకులతో తన ఆలోచనలు పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం: తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యంగా దళితుల జీవితాలను బాగుచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. రాబోయే ఐదేళ్లలో రూ.50వేల కోట్లమేర కేంద్ర, రాష్ట్ర నిధులతో వారి జీవితాల్లో సమూల మార్పులు తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే సాంఘిక సంక్షేమశాఖను కూడా ముఖ్యమంత్రి వద్దే పెట్టుకోనున్నట్లు తెలిసింది. దళితులకు మూడు ఎకరాల భూమి, మొదటి సంవత్సరం పెట్టుబడిని ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నెరవేర్చడానికి అన్ని చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ప్రజాసంక్షేమ పథకాల అమలు విషయంలో స్టేట్ అడ్వయిజరీ కమిటీ ఇచ్చే సలహాలు, సూచనలు ఇవ్వనుంది. ఇక విద్య, వైద్యం, విద్యుదుత్పత్తి, సాగునీటి పారుదల, వ్యవసాయ రంగాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్య అంశాలుగా గుర్తించింది. తెలంగాణలో 85 శాతం ఉన్న బడుగుబలహీన వర్గాల ప్రజలు వ్యవసాయం, వ్యవసాయాధారిత వత్తులపైనే ఆధారపడ్డ నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దష్టి కేంద్రీకరించనున్నారు.

తెలంగాణలో విద్యుత్ లోటు ఉన్నందున దాన్ని పూరించి మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలతోపాటు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయనున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యత, మెరుగైన వైద్యం వంటివాటిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి కేంద్రకరించనుంది. వీటన్నింటిపై కూడా స్టేట్ అడ్వయిజరీ కమిటీ నిర్మాణాత్మక సూచనలు, సలహాలు అందిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో అందుతున్న ఫలాలపై కూడా ఈ కమిటీ పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వానికి రిపోర్టులు అందించనుంది. ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ఉండేలా.. తెలంగాణలో ఉన్న వనరుల వినియోగం, తెలంగాణ సమాజాన్ని చిరునవ్వులతో ముంచెత్తేలా ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక అధికారిక కమిటీగా ఉండనున్న అడ్వయిజరీ కమిటీ క్షేత్రస్థాయికి కూడా వెళ్లి పరిశీలన చేస్తుందని తెలిసింది.