పనులు పూర్తయినచోట ప్రజలకు నీళ్లు

-ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
-ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తొలిప్రాధాన్యం
-తాగునీటి ప్రాజెక్టుకు ప్రత్యేక వెబ్‌సైట్
-డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్టుపై సమీక్ష

KTR review on water grid

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు పూర్తయిన చోట ప్రజలకు నీళ్లందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశం పొందుపరచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనులపై సైట్ల వారీగా అధికారులతో సమీక్షించారు. దాదాపు అన్ని ఇన్‌టేక్ వెల్స్ సేఫ్ స్టేజీకి వచ్చాయని అధికారులు వివరించారు. ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగితే మొత్తం ప్రాజెక్టుని సకాలంలో పూర్తిచేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఏడాదిలోగా, ఆ తర్వాత ప్రతి ఆరునెలలకు ఒకసారి, ఏఏ ప్రాంతాల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయో తెలిపేలా ఒక షెడ్యూల్ అందించాలన్నారు.

ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలైన నల్లగొండ, కరువు పీడిత మహబూబ్‌నగర్ జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఈ జిల్లాల్లో నీటి వనరులకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో పైపులైన్లు పూర్తయిన వెంటనే నీళ్లందించాలని, ఆమేరకు ఆయా ప్రాంతాల్లోని గ్రామీణ పైప్‌లైన్ నెట్‌వర్క్, నీటి ట్యాంకుల నిర్మాణాలకోసం సర్వేలు పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్లతోపాటు ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు వేయనున్న ఫైబర్ అప్టిక్ కేబుల్ వేసే అంశంపై ఐటీ శాఖతో ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ సురేందర్ రెడ్డి, సలహాదారులు జ్ఞానేశ్వర్‌లతో పాటు పలువురు సీఈలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.