పంటనష్టంపై సమగ్ర సర్వే

-ప్రతి రైతునూ ఆదుకుంటాం.. తక్షణం వివరాలు సేకరించండి…
– అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
– నష్టంపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే
– 75వేల హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అంచనా
– 103 మండలాల్లోని 860 గ్రామాల్లో పంటలకు దెబ్బ
– త్వరలో నష్టపరిహారం ప్రకటించనున్న ప్రభుత్వం
– క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన.. అన్నదాతకు భరోసా

KTR visited the rain effected areas in Karimnagar district

రాష్ట్రంలో గత ఐదారు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలుల ఫలితంగా జరిగిన పంట నష్టంపై వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి.. తక్షణం నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టాన్ని అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు.

అధికారులు పంటనష్టంపై వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటకు ఎంత మేరకు నష్టం వాటిల్లింది? ఏ రైతు ఎంత మేర పంట నష్టపోయారు? అనే అంశాలపై సమగ్రంగా సర్వే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వడగండ్లతో నష్టపోయిన ప్రతి రైతు, భూమి వివరాలు సర్వేలో తీసుకోవాలని చెప్పారు. ఏ రైతుకూ అన్యాయం జరగవద్దని, పూర్తి స్థాయిలో సర్వేచేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం కోరినట్లు తెలిసింది. పూర్తి నివేదిక రాగానే ఏ పంటకు ఎంత పరిహారం చెల్లించేదీ త్వరలోనే ప్రకటించి.. చెల్లించేందుకు సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పంట నష్టం అంచనాల్లో ఉన్నామని, సమగ్రంగా వివరాలు సేకరించి త్వరగా అందిస్తామని ఉన్నతాధికారులు సీఎంకు చెప్పినట్లు తెలిసింది. ఆపదలో అన్నదాతను ఆదుకునేందుకు మేమున్నామంటూ సీఎం ఇప్పటికే భరోసా ఇచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపుతున్నారు.

రైతు చెంతకు మంత్రులు
నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. రైతాంగానికి భరోసా కలిగిస్తున్నారు.గతంలో పంటలు 50% నష్టపోతే పరిహారం చెల్లించగా.. ఇటీవల కేంద్రం 33% నష్టపోయినా పరిహారం ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్రంలో ఈ నెల 6-14 వరకు వర్షాలతో నష్టపోయిన పంట సర్వే కొనసాగుతున్నది. రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో జరిగిన పంట నష్టానికి సంబంధించి సమగ్ర వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. దీని ఆధారంగా 33% పంట నష్టపోయినా పరిహారం చెల్లించనున్నారు. 2009-14వరకు తుఫాన్లు, కరువుతో నష్టపోయిన రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ.480కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడుకూడా నష్టపోయిన ఒక్క రైతు కూడా అధైర్యపడాల్సిన పని లేదని.. అందరికీ నష్ట పరిహారం ఇచ్చి ఆదుకుంటామని మంత్రులు భరోసా ఇస్తున్నారు.