పనిచేయని అధికారులపై చర్యలు

-పౌరసరఫరాల శాఖ పనితీరు మెరుగుపరుస్తాం
-రేషన్ కూపన్ల గడువు పెంచాం.. అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు
-బియ్యం ధరలను నియంత్రిస్తాం: మంత్రి ఈటెల రాజేందర్

Etela Rajendar

ప్రతిభ కనబరిచిన అధికారులకే పట్టం కడుతాం.. పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో జేసీ, డీఎస్‌వో, ఆర్డీవోలతో కలిసి పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ పనితీరును మెరుగుపరుస్తామని ప్రకటించారు. గతంలో ఇచ్చిన రేషన్‌కూపన్ల గడువు ముగియడంతో ఆ గడువును మళ్లీ పెంచామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకంటే రేషన్‌కార్డులు అధికంగా ఉన్నట్లు గుర్తించామని, వీటిపై సమీక్షించి అర్హులకే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్‌కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతోనే కొనసాగుతున్నాయని, వాటిని తెలంగాణ రాష్ట్రంగా మార్చేస్తామన్నారు.

కేంద్రంతో మాట్లాడి అర్హత ఉన్నవాళ్లందరికీ కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని హామీఇచ్చారు. జిల్లాలో ఈ ఏడాది 603 కొనుగోలు కేంద్రాల ద్వారా 635 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. రూ.800 కోట్ల కొనుగోళ్లకు చెల్లింపులు పూర్తయ్యేదశలో ఉన్నాయన్నారు. బియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కిలో రూ.30 చొప్పున సూపర్‌ఫైన్ రకం బియ్యాన్ని విక్రయిస్తున్నామన్నారు. ఎవరైనా అధిక ధరలకు బియ్యాన్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోళ్లు కేంద్రాల్లో నిరంతరం తహసీల్దార్ నిఘా ఉంటుందని, నాసిరకం బియ్యం అమ్మితే సహించేది లేదన్నారు. సమావేశంలో జేసీ సర్ఫరాజ్ అహ్మద్, డీఎస్‌వో చంద్రప్రకాష్, ఆర్డీవో చంద్రశేఖర్, తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఎఫ్‌ఐ శ్రీనివాస్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.